గూడ్స్ రైల్ పట్టాలు తప్పడానికి అసలు కారణాలేంటి..? అధికారులు ఏం చెబుతున్నారంటే..

అయితే బుధవారం సాయంత్రం కల్లా ఒక్క ట్రాక్ మీదుగా అయినా రైళ్ల రాకపోకలు కొనసాగించే విధంగా యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. ఘటన స్థలంలో నెలకొన్న పరిస్థితిని బట్టి చూస్తే మాత్రం ఇప్పుడప్పుడే..

గూడ్స్ రైల్ పట్టాలు తప్పడానికి అసలు కారణాలేంటి..? అధికారులు ఏం చెబుతున్నారంటే..
Peddpalli Train Accident
Follow us
G Sampath Kumar

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 13, 2024 | 12:38 PM

పెద్దపల్లి, రామగుండం మార్గ మధ్యలోని 282/38, 282/34 కిలో మీటర్ల మధ్యన ఈ ప్రమాదం సంభవించినట్టుగా రైల్వే అధికారులు గుర్తించారు. మొత్తం 12 బోగీలు పట్టాలు తప్పాయని, 22 వ్యాగన్లు ఘటన స్థలం దాటిన తరువాత ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తేల్చారు. ఐరన్ కాయిల్స్ తరలిస్తున్న గూడ్స్ ట్రైన్ కాబట్టి ఆస్థి నష్టం తప్ప ప్రాణ నష్టం జరగలేదు. అయితే ప్రాథమికంగా రైల్వే అధికారులు మాత్రం ఓవర్ లోడే అసలు కారణమని చెప్తున్నారు. సామర్థ్యానికి మించి లోడ్ చేయడం వల్లే పట్టాలు తప్పి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

రైల్వే అధికారులు సాధారణంగా ఓవర్ లోడింగ్ విధానం అమలు చేస్తుంటారని, అయితే రెండు కోచుల్లో ఎక్కువ మోతాదులో లోడ్ చేసినట్టయితే మరో కోచులో సాధారణ సామర్థ్యం మేరకు లోడింగ్ చేస్తారని తెలుస్తోంది. దీనివల్ల ట్రాక్ పై అదనపు భారం పడకుండా ఉండడంతో పాటు ట్రాక్ పై వెల్తున్నప్పుడు ప్రమాదాలు జరగకుండా ఉంటాయని అంచనా వేస్తారని సమాచారం. ట్రైన్ బ్యాలెన్సింగ్ కూడా తప్పే అవకాశం ఉండదని కూడా తెలుస్తోంది. అయితే రాఘవాపూర్ వద్ద మంగళవారం రాత్రి పట్టాలు తప్పిన గూడ్స్ లోని అన్ని కోచుల్లోనూ సామర్థ్యానికి మించి లోడింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అనుకుంటున్నారు.

సాధారణంగా గూడ్స్ రైళ్లలో లోడింగ్ చేసేప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురు కాకుండా ఉండేందుకు సాంకేతిక నిపుణులు కూడా పర్యవేక్షణ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ట్రాక్ పై వెల్తున్నప్పుడు ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ లోడింగ్ చేయాల్సి ఉంటుందని సమాచారం. అలాంటప్పుడు గజియాబాద్ నుండి వెల్తున్న గూడ్స్ రైలులో మాత్రం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోలేదా, సాంకేతిక విభాగం ఈ అంశాన్ని పట్టించుకోలేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కారణంగానే గూడ్స్ రైల్ ప్రమాదానికి గురైతే మాత్రం ఖచ్చితంగా లోడింగ్ సమయంలో రైల్వే యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉంటుందని స్పష్టం అవుతోంది.

ఇవి కూడా చదవండి

ట్రాక్ మెయింటనెన్స్..? ట్రాక్ మెయింటనెన్స్ విభాగం ఎలాంటి చర్యలు తీసుకుంది అన్న కోణంలో కూడా రైల్వే అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. దక్షిణ భారత దేశానికి, ఉత్తర భారత దేశానికి అనుసంధానం చేస్తే ప్రధాన రైల్వే లైన్ కాబట్టి తరుచూ ఈ ట్రాక్ సామర్థ్యం ఎలా ఉంది, ట్రాక్ కింది భాగంలో భూమి కుంగుబాటుకు గురవుతుందా..? ట్రాక్ సమీపంలో నీటి నిలువ ఉన్నట్టయితే వాటిని మళ్లించడం వంటి చర్యలు చేపట్టాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు ట్రాక్ మెయింటెనెన్స్ వింగ్ అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో ఏకధాటిగా కురిసిన వర్షాల వల్ల ట్రాక్ కింది భాగంలో నీటి నిలువలు చేరడం వల్ల ట్రాక్ కుంగుబాటుకు గురై ఉంటుందా లేక, ట్రాక్ ఇరు పక్కల వాటర్ స్టోరోజ్ వల్ల ట్రాక్ దెబ్బ తిని ఉంటుందా అన్న విషయాన్ని కూడా తెలుసుకునే పనిలో రైల్వే అధికారులు నిమగ్నం అయ్యారు.

ఒక వేళ ట్రాక్ కు ఇరుపక్కల నీటి నిలువ కారణంగానే అక్కడ పట్టాలు కుంగిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్టయితే నీటిని తరలించేందుకు ఏర్పాటు చేసిన డ్రైన్ వ్యవస్థ సరిగా లేదా అన్న విషయంలోనూ ఆరా తీయాల్సి ఉంటుంది. ఒక్క గూడ్స్ రైల్ పట్టాలు తప్పడంతో ఇంతటి 30 నుండి 40 వరకు ట్రైన్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లించాల్సి వచ్చిందని దీనివల్ల రైల్వే శాఖపై అదనపు ఆర్థిక భారం పడినట్టేనని స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో గూడ్స్ రైల్ పట్టాలు తప్పిన ఘటనపై సమగ్ర విచారణ జరిపినట్టయితే వాస్తవాలు బయటపడే అవకాశం ఉంటుదని అదికార వర్గాలు భావిస్తున్నాయి. నిరంతరం ట్రాక్ మెయింటనెన్స్ వింగ్ మాత్రం ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పర్యవేక్షణ జరపాల్సి ఉంటుందని మాత్రం తెలుస్తోంది. ఒక వేళ ట్రాక్ మెయింటనెన్స్ వైఫల్యాలు ఉన్నట్టయితే మాత్రం ఉత్తర, దక్షిణ భారతదేశానికి మెయిన్ లైన్ విషయంలోనే ఇంతటి నిర్లక్ష్యం వహించడాన్ని రైల్వే శాఖ కఠినంగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదు.

అయితే మంగళవారం రాత్రి రాఘవాపూర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో దెబ్బతిన్న ట్రాక్ పనులను పునరుద్దరించే పనిలో రైల్వే యంత్రాంగం నిమగ్నం అయింది. మంగళవారం అర్థారాత్రి ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్ ను బాగు చేస్తున్నారు. కానీ గూడ్స్ రైల్ కోచులు పట్టాలు తప్పడంతో ఈ ప్రాంతం మీదుగా వెల్తున్న మూడు ట్రాకులు కూడా ధ్వంసం అయిపోయాయి. వాటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు గురువారం వరకు వెయిట్ చేయాల్సిందేనని టెక్నికల్ అధికారులు నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే బుధవారం సాయంత్రం కల్లా ఒక్క ట్రాక్ మీదుగా అయినా రైళ్ల రాకపోకలు కొనసాగించే విధంగా యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. ఘటన స్థలంలో నెలకొన్న పరిస్థితిని బట్టి మాత్రం గురువారం ఉదయం వరకు ట్రాక్ పునరుద్దరణ జరిగే అవకాశం లేనట్టుగా స్పష్టం అవుతోంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..