Telangana: సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో మాయమైపోతున్న మందు బిళ్ళలు.. తీరా చూస్తే షాక్..!

ఓ వైపు సీజనల్ వ్యాధులు దడ పుట్టిస్తుంటే, మరో వైపు రోగులకు అందాల్సిన మందు బిల్లలు ఎలుకల పాలవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో సర్కార్ దవాఖానాలో మందులకు ఎలుకల బెడద కలకలం రేపుతోంది.

Telangana: సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో మాయమైపోతున్న మందు బిళ్ళలు.. తీరా చూస్తే షాక్..!
Rats Eating Medicines
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Aug 24, 2024 | 4:06 PM

ఓ వైపు సీజనల్ వ్యాధులు దడ పుట్టిస్తుంటే, మరో వైపు రోగులకు అందాల్సిన మందు బిల్లలు ఎలుకల పాలవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో సర్కార్ దవాఖానాలో మందులకు ఎలుకల బెడద కలకలం రేపుతోంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధ కొరత తీవ్రంగా వేధిస్తుంటే, మరో వైపు‌ అధికారుల నిర్లక్ష్యంతో విలువైన మందులు ఎలుకలకు ఆహారంగా మారడంపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ సెంట్రల్ డ్రగ్ స్టోర్ (సీడీఎస్) లో మందుల నిల్వలకు స్థలం సరిపోక.. సమీపంలోని రిమ్స్ ఆడిటోరియంలో మెడిసిన్స్ నిల్వ చేశారు సిబ్బంది. అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు చేపట్టకపోవడంతో లక్షల విలువ చేసే మందుల ప్యాకెట్లు ఎలకపాలవుతున్నాయి. గోడౌన్‌లో నిల్వ ఉంచిన మందులను ఎలుకలు కొరికేయడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం కారణంగానే ఈ దుస్థితి‌ ఏర్పడిందని తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ లోని నాలుగు జిల్లాల కు పెద్ద దిక్కుగా మారిన డ్రగ్స్ ఎలుకలకు ఆహారంగా మారడం.. పేదలకు పెద్ద దిక్కుగా ఉన్న రిమ్స్ ఆస్పత్రి ‌నుండి మొదలు ఏజెన్సీల్లోని ప్రాథమిక ఆస్పత్రుల వరకు‌ ఈ మందులే ఆధారం కావడంతో ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ (సీడీఎస్) లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించేందుకు వీలుగా మందుల నిల్వ ఉంచారు. సీజనల్ వ్యాధుల విజృంభణంతో ప్రభుత్వం అదనంగా ఔషధాలను.. మందు గోలిలీలను, సిరప్‌లు, ఇంజక్షన్లు, యాంటి బయోటిక్స్ ను సరఫరా చేసింది. మందులు నిల్వ ఉంచుకునేందుకు‌ స్థలం సరిపోక పోవడంతో‌ సమీపంలోని రిమ్స్ ఆస్పత్రులోని‌ ఆడిటోరియం హాల్ లో‌ తాత్కాలికంగా ఔషధాలను నిల్వ ఉంచారు టీఎస్ఎంఐడీసీ అధికారులు. ఈఈ నరసింహారావు పర్యవేక్షణలో నలుగురు సిబ్బంది భద్రతలో ఈ ఔషధాలను పర్యవేక్షిస్తున్నారు.

ఇక్కడి నుండే మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు ఔషధాలను తరలిస్తున్నారు. వానాకాలం కావడం వైరల్ ఫీవర్స్ సంఖ్య పెరగడం డెంగ్యూ, మలేరియా, టైపాయిడ్ జ్వరాల తీవ్రత పెరగడంతో ప్రభుత్వం ఆస్పత్రులకు రోగుల సంఖ్య పెరిగింది. అందుకు తగ్గట్టుగా మందులు ఆస్పత్రులకు సరపరా కావాల్సి ఉన్నా.. కేవలం పారాసిటమల్ తప్ప యాంటి బయోటిక్స్, జింక్ , ఐరన్ టాబ్లెట్స్ అసలు అందుబాటులో లేవు. అయితే ఇప్పుడే అవే ఔషధాలు రిమ్స్ ఆడిటోరియం లోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో ఎలుకల పాలవడం కలకలం రేపింది. సీజనల్ వ్యాధులను తగ్గించే కీలక మైన మందులు ఎలుకలకు ఆహారంగా మారడం.. మరో వైపు రోగులకు అవే మందుల కొరతతో ప్రైవేట్ మెడికల్ స్టోర్లకు పరుగులు తీస్తుండటం కనిపించింది. ఈ దుస్థితికి సెంట్రల్ డ్రగ్ స్టోరీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది.

దాదాపు మూడు లక్షల విలువ చేసే ఐవి సెలెన్స్, సాచరోమైస్ క్యాంపసల్స్, ఓప్లాక్సిన్, సెపికిమస్ యాంటిబయోటిక్స్ డ్రగ్స్ ఎలుకలకు ఆహారంగా మారినట్టు తెలుస్తోంది. దీనిపై టీవి9 సంబంధిత అధికారులను వివరణ కోరగా నామమాత్రంగా నే ఎలుకలు పాడు చేశాయని, స్థలం కొరత కారణంగానే ఇలా జరిగింది తప్ప సిబ్బంది నిర్లక్ష్యం లేదని చెప్పుకొచ్చారు. రిమ్స్ ఆడిటోరియం చుట్టు కిటికీల తెరిచి ఉండటం.. చెల్లా చెదుమదురుగా ఔషధాలు పడివేసి ఉండటం సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సెంట్రల్ డ్రగ్ స్టోర్ అందుబాటులోకి వస్తే మందులను భద్రంగా కాపాడుకోగలుగుతామని చెప్తున్నారు. అయితే దీనిపై రోగులు, రోగుల బంధువులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సెంట్రల్ డ్రగ్ స్టోర్ కు కూత వేటు‌ దూరంలో ఉన్న రిమ్స్ ప్రదాన ఆస్పత్రిలోనే డెంగ్యూ చికిత్సలో భాగమైన మందులు పూర్తి స్థాయిలో దొరకడం లేదని.. డాక్టర్లు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్‌తో హాస్పిటల్‌ ఫార్మసీకి వెళ్తే పారాసిటమాల్ తప్ప ఏ మందులు దొరకడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటని అడిగితే సరఫరా లేదనీ, బయట కొనుక్కోవాలని ఉచిత సలహా ఇస్తున్నారని రోగులు చెబుతున్నారు. దాంతో చికిత్స కోసం వచ్చే పేద రోగులకు మందుల కొనుగోలు పెను భారంగా మారుతోంది. ట్రీట్‌మెంట్‌ వరకు ఉచితంగానే అందుతున్నా, మందులు మాత్రం పూర్తి స్థాయిలో దొరకడం లేదని బాధితులు వాపోతున్నారు. మరో వైపు ఇదే రిమ్స్ ఆడిటోరియం లో నిల్వ ఉంచిన ఔషధాలు‌మాత్రం ఎలుకలకు ఆహారం అవడం అధికారుల నిర్లక్ష్యాన్ని‌ కళ్లకు‌కడుతోంది..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..