
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్‌పూర్‌లో గంజాయి సాగు వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. కిస్మత్‌పూర్‌లోని నిర్మానుష ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఓ వ్యక్తి గుట్టుచప్పుడు కాకుండా గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. గంజాయి అక్రమంగా సరఫరా జరుగుతోందని సమాచారం అందగా.. రాజేంద్రనగర్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టడంతో గుట్టురట్టు అయింది. కిస్మత్‌పూర్‌లో ఆకస్మికంగా దాడులు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు ఆ ప్రాంతంలో దాడులు నిర్వహించారు.
యూపీకి చెందిన రాజేందర్ అనే యువకుడ్ని అరెస్ట్ చేశారు. సాగు చేస్తున్న ప్రాంతం నుంచి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గత నాలుగైదు నెలలుగా కిస్మత్‌పూర్‌లో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిర్మానుష ప్రాంతాన్ని ఎంచుకుని ఎవరికి అనుమానం రాకుండా గంజాయి మొక్కలను పెంచుతూ, చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే యువకులకు గంజాయిని సరఫరా చేస్తున్నట్టు తేల్చారు. స్థానిక యువతను లక్ష్యంగా చేసుకుని మత్తుకు అలవాటు చేస్తున్నాడన్న అనుమానంతో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. గంజాయి మొక్కల సాగు వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా?.. గంజాయి సరఫరాకు నెట్‌వర్క్ ఏమైనా పనిచేస్తుందా?.. అనే కోణాల్లో రాజేంద్రనగర్ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేయడంతోపాటు.. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఇక.. కిస్మత్‌పూర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో మత్తు పదార్థాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాల మాయలో పడి.. భవిష్యత్‌ను యువత ప్రమాదంలో పడేసుకోవద్దని సూచించారు. గంజాయి, డ్రగ్స్ విషయంలో కఠిన చర్యలు తప్పవని రాజేంద్రనగర్ పోలీసులు హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..