గత నాలుగైదు రోజులుగా శాంతించిన వరుణుడు మళ్లీ ప్రతాపం చూపించనున్నాడు. ఈ నేపథ్యంలో తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం రాష్ట్రంలో కనిపిస్తోంది. ఈ ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో బుధవారం నుంచి 3 రోజుల పాటు తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలోనే తెలంగాణలోని ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
వర్షాల నేపథ్యంలో ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై మబ్బులు కుమ్ముకుంది. అక్కడక్కడ చిరుజిల్లులు కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
అటు, ఏపీలో ఈ ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈరోజు అల్లూరి సీతారామరాజు, విజయనగరం, బాపట్ల, కృష్ణా, పార్వతీపురం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..