Telangana: తోడ పుట్టడమే ఆమె చేసిన పాపమా.. సొంత అన్నే కాలయముడై ఏం చేశాడంటే?
ఒకప్పుడు రక్త సంబంధం అంటే ఆప్యాయత, అనురాగం, అండగా నిలిచే బంధం. కానీ ఈ రోజుల్లో అవన్నీ కేవలం ఆర్థిక బంధాలుగా మారిపోయాయి. డబ్బుల కోసం రక్త సంబంధాలనే తెంచుకునే వరకు వెళ్లిపోయాయి. ఆస్తిపాస్తుల కోసం సొంతవారినే పొట్టనపెట్టుకునే పరిస్థితులు దాపరించాయి. తాజాగా ఇలాంటి ఘటనే నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. ఆస్తికోసం తోబుట్టువునే అంతమెందించాడు ఓ కిరాతకుడు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఆస్తికోసం తోడబుట్టిన ఆమెనే కడతేర్చిన ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే… ఆత్మకూర్ (ఎస్) మండలం పెన్ పహాడ్‌కు చెందిన సైదులుకు తోబుట్టువులుగా అక్క అంజమ్మ , చెల్లెలు లింగమ్మ , ఉపేంద్ర ఉన్నారు. ముగ్గురికి వివాహం కాగా, అక్క అంజమ్మ.. చిన్నతనంలోనే భర్త చనిపోవడంతో ఇంటి వద్దే ఉంటుంది. అయితే 2007లో ఉపేంద్ర వివాహ సమయంలో పసుపు, కుంకుమల కింద గ్రామంలోని సర్వే నెంబర్ 119 లో 2.5 ఎకరాల భూమి ఆమెకు ఇచ్చారు. ఇదే భూమి విషయంలో గత కొన్ని రోజులుగా అన్న సైదులు, చెల్లి ఉపేంద్ర మధ్య గొడవలు జరుగుతున్నాయి.
దీంతో ఈ భూ వివాదంపై జిల్లా కలెక్టర్, ఆర్డీవో, పోలీసుల సమక్షంలో పంచాయితీ జరిగింది. అయితే ఈ వివాధంలో అక్క అంజమ్మ ఉపేంద్రకు మద్దతుగా మాట్లాడింది. దీంతో అక్కపై తమ్ముడు సైదులు అక్కసు పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం ఉదయం కరువు పని కోసం వెళ్తున్న అంజమ్మను సైదులు తన బావమరుదులతో కలిసి దాడి చేశాడు. కల్లు గీసే కత్తితో ఆమెను దారుణంగా హత్య చేశాడని మృతురాలు బంధువులు ఆరోపిస్తున్నారు. సైదులు కుటుంబంతో తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసులను కోరామని బాధితులు చెబుతున్నారు. కానీ ఇంతలోనే దారుణం జరిగిందని మృతురాలు సోదరి ఉపేంద్ర కన్నీటి పర్యంతమైంది .
ఇక సమాచారం తెలుసుకున్న ఆత్మకూరు పోలీసులు ఘటనా స్థలంలో క్లూస్, డాగ్ టీంలతో ఆధారాలను సేకరించారు. ఈ హత్యకు భూ వివాదమే కారణమని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ హత్యలో ఎంతమంది నిందితులు పాల్గొన్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
