Professor Haragopal: చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) పై ప్రొఫెసర్ హరగోపాల్ సంచలన కామెంట్స్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ డిక్లరేషన్ సమావేశంలో పాల్గొన్న హరగోపాల్.. ఊపా చట్టాన్ని (UAPA Act) ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ చట్టాన్ని ఎత్తివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని హరగోపాల్ కోరారు. కఠినమైన ఉపా చట్టాన్ని రద్దు చేయకుంటే మరో ఉద్యమం చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. సామాజిక సమస్యను పరిష్కరించే పరిస్థితుల్లో లేని రాజ్యాలు.. బల ప్రయోగం చేయటం కోసమే ఇలాంటి కేసులు పెట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు హరగోపాల్. ఎట్టకేలకు సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రొఫెసర్ హరగోపాల్ పై దేశద్రోహం కేసు ఎత్తివేస్తున్నట్లు ములుగు ఎస్పీ ప్రకటించారు. హరగోపాల్‌తో పాటు మరో ఐదుగురిపై నమోదు చేసిన ఉపా కేసులు ఎత్తివేస్తున్నట్లు చెప్పారు. దీనిపై న్యాయరంగా మెమో దాఖలు చేస్తామని పోలీసులు వెల్లడించారు.
అయితే, ప్రొఫెసర్ హరగోపాల్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని.. మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్ పేరుందని ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో ఏడాది క్రితమే ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ కేసు ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, హరగోపాల్ సహా.. పలువురు ప్రజా సంఘాల నేతలపై దేశద్రోహం కేసు నమోదు చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. వారిపై నమోదు చేసిన కేసును ఎత్తివేయాలంటూ డిమాండ్లు వచ్చాయి. లేకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించాయి.
ఈ క్రమంలో సీఎం కేసీఆర్ జూన్ 17న కీలక ఆదేశాలు జారీ చేశారు. హరగోపాల్ పై నమోదు చేసిన ఉపా కేసును ఎత్తివేయాలని డీజీపీ అంజనీకుమార్ ను ఆదేశించారు. ఆ తర్వాత హరగోపాల్ సహా ఐదుగురిపై నమోదు చేసిన ఉపా కేసును ఎత్తివేస్తున్నట్లు ములుగు ఎస్పీ ప్రకటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..