బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి మీ ఆశలు నెరవేరకుండా చేసింది: ప్రియాంక

కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడైనా ప్రజల ఆకాంక్షలకే విలువ ఇచ్చిందన్నారు ప్రియాంక. ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలన్నారు . బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి మీ ఆశలు నెరవేరకుండా చేసిందన్నారు.

బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి మీ ఆశలు నెరవేరకుండా చేసింది: ప్రియాంక
Priyanka Gandhi

Updated on: Oct 18, 2023 | 7:32 PM

రాజకీయ లబ్ధి కోసం ఆలోచించకుండా తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చారని ప్రియాంకగాంధీ తెలిపారు.  రాజకీయంగా నష్టమని తెలిసినా.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామన్నారు. రాజకీయ మూల్యం చెల్లించి మరీ తెలంగాణను సోనియా గాంధీ ఇచ్చారని ప్రియాంకగాంధీ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడైనా ప్రజల ఆకాంక్షలకే విలువ ఇచ్చిందన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలన్నారు ప్రియాంక. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి మీ ఆశలు నెరవేరకుండా చేసిందన్నారు. తెలంగాణ వస్తే…రైతుల జీవితం బాగుపడుతుందని ఆశించారని.. ఉద్యోగాల కోసం యువత ఆత్మహత్యలు ఆగుతాయని అనుకున్నట్లు తెలిపారు. సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం దొరుకుతుందని అనుకున్నా.. కానీ ఫలితం శూన్యమన్నారు.

నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌గాంధీ ఎప్పుడూ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల గురించే ఆలోచించేవారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే రాష్ట్రానికి ఎన్నో జాతీయ సంస్థలు కేటాయించారన్నారు. తెలంగాణ డెవలప్‌‌మెంట్ కోసం కాంగ్రెస్‌ పార్టీ ఒక రోడ్‌ మ్యాప్‌ క్రియేట్ చేసిందన్నారు. ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలన్నారు.  బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ముగ్గురే బీసీ మంత్రులు ఉన్నారన్నారు ప్రియాంక. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా ప్రకారం న్యాయం జరగటం లేదన్నారు. దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని కాంగ్రెస్‌ ప్రధాన డిమాండ్ అని చెప్పారు. ఎవరి జనాభా ఎంత ఉందో తెలియకుండా ఎలా న్యాయం చేస్తారు? అని ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ సర్కార్ ప్రభుత్వం రిమోట్‌ ప్రధాని మోదీ చేతిలో ఉందన్నారు ప్రియాంక.  బీఆర్‌ఎస్, బీజేపీ కలిసిపోయాయని ఆరోపించారు. శాండ్‌ మాఫియా, ల్యాండ్‌ మాఫియా, మద్యం మాఫియా రాష్ట్రాన్ని దోచుకుంటోందన్నారు. 18 మంత్రిత్వశాఖలు కేసీఆర్‌ ఫ్యామిలీ చేతిలోనే ఉన్నాయన్నారు. బీఆర్‌ఎస్ నేతలు రూ.వందల కోట్లు లూటీ చేసి భారీ బిల్డింగులు కట్టుకున్నారని ఆరోపించారు.

మహిళల కష్టాలు తీర్చేందుకే రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. గల్ఫ్‌ కార్మికులను ఆదుకునేందుకు..  ప్రత్యేక గల్ఫ్‌ సెల్‌ ఏర్పాటు చేస్తామన్నారు ప్రియాంక. రైతులకు రూ.2 లక్షల వ్యవసాయ రుణాలు మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు.  ప్రతి రైతుకు ఏడాదికి ఎకరాకు రూ.15,000 ఇస్తామని.. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12,000 ఇస్తామని ప్రియాంక గాంధీ తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారు. ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ఎస్సీలకు రూ.12 లక్షల సహాయం చేస్తామని ప్రకటించారు.  18 ఏళ్లు దాటిన యువతులకు ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇవ్వనున్నట్లు వివరించారు. ఇందిరమ్మ ఇల్లు కింద ఎస్టీలకు ఇంటిస్థలం, ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు ఇస్తామన్నారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..