Droupadi Murmu: నేడు భద్రాచలంలో రాష్ట్రపతి పర్యటన.. పటిష్ఠ భద్రత ఏర్పాటు.. భక్తులకు దర్శనాలు నిలిపివేత..

|

Dec 28, 2022 | 7:35 AM

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఇవాళ (బుధవారం) భద్రాచలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర బలగాలు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాయి. సారపాక, భద్రాచలంలో భారీ బందోబస్తు చేపట్టాయి. పట్టణంలో...

Droupadi Murmu: నేడు భద్రాచలంలో రాష్ట్రపతి పర్యటన.. పటిష్ఠ భద్రత ఏర్పాటు.. భక్తులకు దర్శనాలు నిలిపివేత..
Dropadi Murmu
Follow us on

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఇవాళ (బుధవారం) భద్రాచలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర బలగాలు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాయి. సారపాక, భద్రాచలంలో భారీ బందోబస్తు చేపట్టాయి. పట్టణంలో144 సెక్షన్ అమలు చేశారు. ఉదయం 10 గంటలకు సారపాక ఐటీసీ హెలి ప్యాడ్ చేరుకోనున్న రాష్ట్రపతి.. రామాలయంలో సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ప్రసాద్ పథకం కింద పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. వీరభద్ర పంక్షన్ హాలులో వన వాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ గిరిజన పూజారులతో రాష్ట్రపతి భేటీ అవుతారు. సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ కు చేరుకుని భోజనం చేయనున్న రాష్ట్రపతి.. మధ్యాహ్నం 2.30 గంటలకు రామప్ప ఆలయ సందర్శనకు బయలుదేరతారు. రాష్ట్రపతి పర్యటన లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ పాల్గొననున్నారు.

రాష్ట్రపతి పర్యటన సందర్భంగా భద్రాచలంలో కఠిన ఆంక్షలు విధించారు. మీడియాకు అనుమతి నిరాకరించడంతో పాటు రామాలయంలో భక్తులకు దర్శనాల నిలిపివేశారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనాలు ఉండవని ప్రకటించారు. భద్రాచలం, సారపాక ల్లో 144 సెక్షన్ అమలు చేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కలెక్టర్ ఆదేశించారు. దీంతో భద్రాచలంలోకి రాకపోకలు నిలిపివేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో కేంద్ర, రాష్ట్ర బలగాలు మూడు వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత చేపట్టాయి.

రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులు ఇక్కడే మకాం వేశారు. ఐటీసీలోని హెలిప్యాడ్‌ నుంచి గోదావరి వంతెన, పర్యాటక భవనం రోడ్డు, కృష్ణాలయం మీదుగా రాష్ట్రపతి రామాలయం చేరుకోనున్నారు. దాదాపు 3 కి.మీ పొడవున మంగళవారం భారీ వాహన శ్రేణితో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఇందులోనే పోలీసు గస్తీ, మెడికల్‌ బృందం, అధికారుల వాహనాలు తమ హోదాలతో ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..