బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ప్రజా సమస్యలను విస్మరించిందని కాంగ్రెస్ పార్టీ జనంలోకి బలంగా తీసుకెళ్ళి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసేందుకు డిసెంబర్ 28న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణలో ప్రజా పాలన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది..రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులతో కలిపి మొత్తం 16,395 ప్రదేశాలలో ప్రజాపాలన సదస్సులు నిర్వహించడానికి 3,714 అధికార బృందాలను ఏర్పాటు చేశారు.
మహిళలకు పురుషులకు వేరు వేరు క్యూలైన్లు ఏర్పాటు చేయటమే కాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రతి 100 దరఖాస్తు దారులకు ఒక కౌంటర్ ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాపాలన కార్యక్రమం మానిటరింగ్ చేయడానికి ప్రతీ జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజా పాలనలో అభయహస్తం క్రింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పధకాల కోసం అర్హులైన వారు ముందస్తుగా దరఖాస్తును నింపి ప్రజా పాలన సదస్సు కౌంటర్లో సమర్పించి రశీదును పొందే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రజా పాలనలో స్వీకరించిన ప్రతీ దరఖాస్తుకు ప్రత్యేక నెంబర్ ఇచ్చారు..
ఇక ప్రజా పాలన ప్రారంభమైన మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 7,46,414 దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల నుండి 2,88,711 దరఖాస్తులు, పట్టణ ప్రాంతాల నుండి జీహెచ్ఎంసీతో సహా 4,57,703 దరఖాస్తులు వచ్చాయి. రెండవ రోజు నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో మొత్తం 8,12,862 దరఖాస్తులు వచ్చాయి ఈ దరఖాస్తులలో పట్టణ ప్రాంతాలలో జిహెచ్ఎంసి తో కలిపి 4,89,000 దరఖాస్తులు రాగా, గ్రామీణ ప్రాంతాల నుండి 3,23,862 దరఖాస్తులు వచ్చాయి. చాలా ప్రాంతాల్లో ప్రజలకు ప్రజాపాలన దరఖాస్తులు అందకపోవడంతో ప్రజలు జిరాక్స్ షాపుల్లో క్యూ కట్టారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రజా పాలన దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతుభరోసా, పింఛన్లపై అపోహలొద్దుని పాత లబ్ధిదారులందరికీ యథాతథంగా అందచేస్తామన్నారు. కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారే దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రజాపాలన 3 రోజుల్లో 40 ,57,592 దరఖాస్తులు స్వీకరించారు.
ప్రజా పాలన ప్రారంభించిన ఏడో రోజు నాటికి దరకాస్తుల సంఖ్య 1,08,94,115 లకు చేరింది. ఇప్పటివరకు వచ్చిన దరకాస్తుల్లో ప్రధానంగా ఆరు గ్యారెంటీలకు సంబంధించి 10 ,68 ,276 దరఖాస్తులు రాగా, 2 ,60 ,998 ఇతర అంశాలవి ఉన్నాయి. ఈ ఏడు రోజులకు కలిపి అభయ హస్తం ఆరు గ్యారెంటీలకు సంబంధించి 93 ,38 ,111 దరకాస్తులు ఉండగా, ఇతర అంశాలకు సంబంధించి 15 ,55 ,704 ఉన్నాయి. ప్రజాపాలన గ్రామ సభల్లో ఇప్పటి వరకు 1 ,02 ,49 ,312 గృహస్తులు పాల్గొన్నారు. ఇక ఇప్పటివరకు ఉన్న దరఖాస్తులకు అదనంగా ప్రజా పాలన లో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి
ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీ జనవరి 17వ తేదీ వరకు పూర్తి చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దరకాస్తు ఇవ్వని వారు, మరోసారి తిరిగి దారకాస్తులు అందచేయవచ్చు అంటుంది రాష్ట్ర ప్రభుత్వం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..