Poultry lockdown : సమ్మె కూత..  చికెన్ ప్రియులకు మరో షాక్  కోళ్ల కొరత  తప్పదా..?

కోడి కొండెక్కింది..మార్కెట్లో కిలో చికెన్ రేటు మూడు వందలు దాటింది... రోజు రోజుకు చికెన్ ధర పెరుగుతూనే ఉంది. కానీ కోడిని పెంచిన రైతుకు కిలోకు దక్కుతున్నది నాలుగు రూపాయల యాభై పైసలు మాత్రమే. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం.

Poultry lockdown : సమ్మె కూత..  చికెన్ ప్రియులకు మరో షాక్  కోళ్ల కొరత  తప్పదా..?
Poultry Farmers
Follow us
Jyothi Gadda

|

Updated on: May 20, 2022 | 8:33 PM

కోడి కొండెక్కింది..మార్కెట్లో కిలో చికెన్ రేటు మూడు వందలు దాటింది… రోజు రోజుకు చికెన్ ధర పెరుగుతూనే ఉంది. కానీ కోడిని పెంచిన రైతుకు కిలోకు దక్కుతున్నది నాలుగు రూపాయల యాభై పైసలు మాత్రమే. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. రాష్ట్రంలోని కోళ్ల పరిశ్రమను కొన్ని కార్పోరేట్ శక్తులు తమ గుప్పిట్లో తీసుకొని పౌల్ట్రీ రైతులను కూలీలుగా మార్చేశాయి. గత కొన్ని సంవత్సరాలుగా పుట్టగొడుగుల్లా కార్పోరేట్ కంపెనీలు హోల్ సేల్ , రిటైల్ మార్కెట్లను శాసిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ విధానంతో పౌల్ట్రీ రైతుల బతుకులను ఆగం చేస్తున్నాయి. పెరిగిన ధరలకనుగుణంగా గ్రోయింగ్ ఛార్జీలు పెంచాలని కార్పోరేట్ కంపెనీలను వేడుకున్నా లాభం లేకుండా పోయింది. దీంతో తెలంగాణా వ్యాప్తంగా కోళ్ల రైతులు లాక్ డౌన్ పాటిస్తున్నారు. బ్రాయిలర్ కోళ్ల రైతుల సమ్మె కొనసాగితే మార్కెట్లో కోళ్ల కొరత ఏర్పడంతో పాటు చికెన్ ధర ఆకాశానంటే అవకాశం ఉంది.

ఒకప్పుడు సొంతంగా కోళ్ల ఫారాలను పెట్టుకొని మార్కెటింగ్ చేసుకున్న రైతులు కార్పోరేట్ కంపెనీల ఆగడాల వల్ల ఇప్పుడు కోళ్లను పెంచలేని, పెంచితే అమ్మలేని స్థితికి చేరుకున్నారు. హేచరీల నుంచి పిల్లలను, దాణా కంపెనీల నుంచి ఫీడ్ ను కార్పోరేట్ కంపెనీలు తెచ్చిస్తే రైతులు కేవలం కోళ్లను పెంచి ఇచ్చే కూలీలుగా మారి పోయారు. చాకిరీ చేసేది రైతులైతే లాభాలన్నీ కార్పోరేట్ కంపెనీల జేబుల్లోకి వెళ్లిపోతున్నాయి. కంపెనీల ఆగడాలకు ప్రభుత్వం ముకుతాడు వేయకపోవడంతో రైతులకు కనీసం కూలీ పైసలు కూడా గిట్టుబాటు కావడం లేదు. దీంతో ఏటా వందలాది రైతులు ఇంటిగ్రేటెడ్ పౌల్ట్రీ ఇండస్ట్రీని వదిలి పెడుతుండగా..ఇది తప్ప వేరే పని తెలియని వాల్లు గ్రోయింగ్ ఛార్జీలు పెంచాలంటూ వేడుకుంటున్నారు. ఇప్పటికే మార్కెట్ లో బ్రాయిలర్ కోళ్లు తగ్గి పోయాయి. ఇలాగే సమ్మె కొనసాగితే రానున్న రోజుల్లో చికెన్ ధర మరింత పెరగడంతో పాటు కోళ్ల కొరత ఏర్పడే ప్రమాదం కూడా లేకపోలేదు.

రాష్ట్రంలో సుమారు ముప్పై వేలకు పైగా బ్రాయిలర్ కోళ్ల ఫారాలుండగా రెండున్నర కోట్లకు పైగా కోళ్ల పెంపకం జరుగుతోంది. ఈ కోళ్ల ఫారాలపై ఆధారపడి ప్రత్యక్షంగా లక్షలాది మంది బతుకుతున్నారు. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కార్పోరేట్ సంస్థల కింద పని చేసే మూడు వేల ఆరు వందల కోళ్ల ఫారాలున్నాయి. ఈ కోళ్ల ఫారాలపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవించే వారి సంఖ్య కూడా వేలల్లో ఉంటుంది. గతంలో రైతులే స్వయంగా కోడి పిల్లలను, దాణా, మందులను కొని కోళ్లను పెంచి మార్కెట్ లో హోల్ సేల్ వ్యాపారులకు అమ్ముకునేవాళ్లు. క్రమంగా ఈ వ్యాపారంలోకి కార్పోరేట్ కంపెనీలు ప్రవేశించి ఇంటిగ్రేటెడ్ పద్ధతిని ప్రవేశపెట్టాయి. ఈ విధానంలో కోడి పిల్లలను, దాణాను మందులను కార్పోరేట్ కంపెనీలే సప్లయ్ చేసి, పెంపకానికి రైతులకు అప్పగిస్తున్నాయి. ఇందుకోసం కిలోకు నాలుగు రూపాయల యాభై పైసలు గ్రోయింగ్ ఛార్జీలు చెల్లిస్తున్నాయి. మొదట్లో ఈ కంపెనీలు రైతుల నుంచి వాళ్లు చెప్పిన రేటుకే కోళ్లను కొని మార్కెటింగ్ చేశాయి. క్రమంగా మార్కెట్ పై పట్టు సాధిస్తూ హేచరీస్, దాణా కంపెనీలతో కలిసిపోయి ఇంటిగ్రేటెడ్ విధానానికి తెరతీశాయి. కొన్ని హెచరీలే స్వయంగా కంపెనీల అవతారమెత్తాయి. తమ దగ్గరే కోడి పిల్లలు, ఫీడ్ కొని, తమ కే అమ్మడం తప్ప వేరే గత్యంతరం లేని స్థాయికి రైతులను దిగజార్చాయి. రైతులను కూలీలుగా మార్చి, వాళ్ల షెడ్లలోనే కోళ్లను రైతులను కూలీలుగా మార్చి, వాళ్ల షెడ్లలోనే కోళ్లను పెంచి వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

కంపెనీలు తెచ్చిన ఇంటిగ్రేటెడ్ విధానం వల్ల రైతులు గొడ్డు చాకిరీ చేస్తున్నారు. కోడి పిల్ల వచ్చిన మొదటి రోజు నుంచి కోళ్లను లిఫ్టింగ్ చేసే వరకు శ్రమంతా రైతులదే. కోళ్ల ఫారాల దగ్గర లేబర్ ఖర్చు, వ్యాక్సినేషన్ ఖర్చు, కరెంటు బిల్లు, ఉనక, కోల్ల లిఫ్టింగ్ తదితర ఖర్చులన్ని రైతులే భరించాలి. కానీ కంపెనీలు కోడి పిల్లకు 34రూపాయలు, దాణాకు కీలోకు 47, అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ పేరిట ఒక్కో కోడి పిల్లకు ఆరు రూపాయల చెప్పున ఖర్చు రాసి లెక్కలు వేస్తున్నాయి. మందులకు అదనపు ఛార్జీలు మోపుతున్నాయి. ఇక కోళ్లను లిఫ్టింగ్ చేసిన తర్వాత సంస్థ పెట్టిన ఖర్చులన్నీ లెక్కతీస్తే కేజి చికెన్ తయారు కావడానికి 95 రూపాయలకు మించరాదు. అప్పుడే రైతుకు కేజీకి ఐదు రూపాయల 80 పైసల చొప్పున చెల్లిస్తామని కంపెనీలు చెప్తున్నాయి. కానీ ఈ ఖర్చు పెరుగుతుండడంతో రైతుకు చెల్లించే డబ్బుల నుంచి ప్రతి రూపాయికి 50 పైసల చొప్పున కట్ చేస్తున్నాయి. ఈ కటింగ్ లు పోగా…కోళ్ల ఫారాల్లో పెంచిన కోళ్లకు కిలోకు కంపెనీలు రైతులకు చెల్లించే గ్రోయింగ్ ఛార్జీ నాలుగు రూపాయల 50 పైసలకు మించడం లేదు. కొందరు రైతులకైతే ఆ నాలుగున్నర రూపాయలు కూడా రావడం లేదు. కూలీ రేట్లు, ఉనక ఖర్చు,కరెంటు బిల్లులు, లోన్లకు వడ్డీలు, ఇతరాత్ర మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోవడంతో తమకు కంపెనీలు ఇచ్చేది ఏమూలకూ సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల రైతులకు న్యాయంగా రావల్సిన హక్కులు వారికి చెందేలా చూడాల్సిన బాధ్యత కార్పోరేట్ సంస్థలపైనే ఉందంటున్నారు. సమస్యకు త్వరగా ఫుల్ స్టాప్ పెట్టక పోతే…పరిస్థితులు చేజారే ప్రమాదం లేకపోలేదు.