ప్రభ బండ్ల జాతర కోసం రాత్రంతా జాగరణ చేసిన 600 మంది పోలీసులు

వరంగల్ జిల్లాలో రాజకీయ ప్రభల ఆధిపత్య ప్రదర్శనతో హై టెన్షన్ వాతావరణ నెలకొంది. రాత్రంతా పోలీసులకు ఈ జాతర జాగరణ మిగిల్చింది. ఎట్టకేలకు జాతర ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు మార్చి 18వ తేదీతో ముగియనున్నాయి.

ప్రభ బండ్ల జాతర కోసం రాత్రంతా జాగరణ చేసిన 600 మంది పోలీసులు
Kommala Laxmi Narasimha Swamy Jathara

Edited By:

Updated on: Mar 15, 2025 | 10:09 AM

హోలీ పర్వదినాన వరంగల్ జిల్లాలో నిర్వహించే కొమ్మాల జాతర ఫుల్ ఫేమస్.. కానీ ఆ జాతరలో రాజకీయ ప్రభ బండ్ల ఆధిపత్య ప్రదర్శన హై టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. రెండు దశాబ్దాల తర్వాత మూడు ప్రధాన రాజకీయ పార్టీల ప్రభబండ్లు ఎవరికి వారు ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. అధికార పార్టీలో మూడు నేతలు గ్రూప్ వార్ తో సై అంటే సై అని ప్రభలతో పోటీపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ కూడా తగ్గేదే లే అన్నట్లు ప్రభలను ప్రదర్శించారు. జాతర ప్రశాంతంగా నిర్వహించడం కోసం 600 మంది పోలీసులకు జాగరణ చేయాల్సి వచ్చింది..

హోలీ పౌర్ణమి రోజు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహా వైభవంగా జాతర జరుగుతుంది. ఈసారి కూడా ఆనవాయితీ ప్రకారం వైభవంగా జాతర నిర్వహించారు.. జాతరకు వేలాదిమంది ప్రజలు తరలి వచ్చారు. లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని పులకరించి పోయారు. అయితే జాతర సందర్భంగా రాజకీయ పార్టీల ప్రభ బండ్ల ప్రదర్శన టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మూడు వర్గాలు ఉద్రిక్తతకు కారకులయ్యారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి vs మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి, ఆలయ చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి ఈ ముగ్గురు నేతల వర్గాలు పోటాపోటీగా ఆధిపత్య ప్రదర్శనకు దిగారు. బారీ ప్రభలతో జాతరకు ఫుల్ జోష్ తీసుకువచ్చారు. ఇందులో కొండా vs రేవూరి రెండు వర్గాలు పోటీ పడడంతో డీ అంటే డీ అన్నట్లుగా అక్కడ పరిస్థితి మారింది.. పోలీసులు రంగంలోకి దిగి అల్లర్లు జరగకుండా అదుపు చేశారు.

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్వయంగా ప్రభ బండి నడుపుకుంటూ జాతరకు తరలివచ్చారు. మరోవైపు కొండా మురళి తన అనుచర వర్గంతో హడావుడి చేశారు. ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి జాతరలో హై టెన్షన్ క్రియేట్ అయ్యేలా చేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రభలు కూడా తగ్గేదెలే అన్నట్లుగా భారీ ఎత్తున తరలి వచ్చాయి. చుట్టుపక్కల గ్రామాల నుండి తరలివచ్చిన బీఆర్ఎస్ ప్రభలు కొమ్మల జాతరలో ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేసి హల్చల్ చేశారు. అయితే ఈ ప్రధాన రాజకీయ పార్టీల ప్రభావాలు ఇక్కడ ఇదురుపడకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో అల్లర్లు జరగకుండా ప్రదర్శన ప్రశాంతంగా ముగిసింది. ఎప్పుడు కనిపించని బీజేపీ కూడా ఈసారి మేం కూడా తగ్గేది లేనట్టుగా ప్రభబండ్లతో కదిలి వచ్చి ఇక్కడ ఆధిపత్య ప్రదర్శనకు దిగారు. బీజేపీ ప్రభలు కూడా కొమ్మాల జాతరలో హల్చల్ చేశాయి..

అయితే గతంలో ఈ ప్రభ బండ్ల ప్రదర్శన సందర్భంగా హత్యల వరకు దారి తీయడంతో పోలీసులు కొంతకాలం నిషేధం విధించారు. ఆ తర్వాత మళ్లీ గత జాతర నుండి రాజకీయ పార్టీల సందడి మొదలైంది. ఈసారి ఎవరికి వారు తగ్గేదెలే అన్నట్లుగా పోటాపోటీగా ప్రభలతో తరలిరావడం ఉద్రిక్తతకు దారి తీసింది.. ఆధిపత్య ప్రదర్శనకు కొమ్మాల జాతర వేదికయింది.

రాజకీయ ప్రభల ఆధిపత్య ప్రదర్శనతో హై టెన్షన్ వాతావరణ నెలకొంది. రాత్రంతా పోలీసులకు ఈ జాతర జాగరణ మిగిల్చింది. ఎట్టకేలకు జాతర ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మార్చి 18వ తేదీన ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..