Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode ByPoll: చివరి దశకు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల పాట్లు..

దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మునుగోడు ఉప ఎన్నిక.. ఇప్పటివరకు హుజురాబాద్ ఉప ఎన్నికనే అత్యంత ఖరీదైన ఎన్నికగా ప్రచారం జరగ్గా.. ప్రస్తుతం దేశంలోనే ఖరీదైన ఎన్నికగా మునుగోడు ఉప ఎన్నిక మారుతుందనే ప్రచారం..

Munugode ByPoll: చివరి దశకు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల పాట్లు..
Munugode Bypoll
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 30, 2022 | 7:16 AM

దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మునుగోడు ఉప ఎన్నిక.. ఇప్పటివరకు హుజురాబాద్ ఉప ఎన్నికనే అత్యంత ఖరీదైన ఎన్నికగా ప్రచారం జరగ్గా.. ప్రస్తుతం దేశంలోనే ఖరీదైన ఎన్నికగా మునుగోడు ఉప ఎన్నిక మారుతుందనే ప్రచారం ఊపందుకుంది. దీంతో తెలంగాణ ప్రజలకే సరిగ్గా తెలియని మునుగోడు నియోజకవర్గం ఇప్పుడు జాతీయ వార్తల్లో నిలుస్తోంది. మునుగోడులో గెలుపు రాజకీయపార్టీలు తమ శక్తిమేరకు ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల ప్రచార గడువు చివరి దశకు చేరుకుంది. మరో మూడు రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు పడరాని పాట్లు పడుతున్నాయి. తమ పార్టీకే ఓట్లు వేయాలని వివిధ పార్టీల నాయకులు ప్రతి ఓటరును నేరుగా కలిసి అభ్యర్థిస్తున్నా.. సదరు ఓటరు మనసులో ఏముందో మాత్రం పార్టీలకు అర్థం కావడంలేదు. ఇక ప్రచారం విషయానికొస్తే ఉదయం ఓ పార్టీ ప్రచారంలో కనిపిస్తున్న వారు.. సాయంత్రం మరో పార్టీ ప్రచారంలో కనిపిస్తున్నారు. దీంతో పోలింగ్ రోజున ఏ ఓటరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనే టెన్షన్ వాతావరణం పోటీలో ఉన్న అభ్యర్థుల్లో కనిపిస్తోంది. ప్రధానపోటీ టీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య కనిపిస్తున్నప్పటికి బీఎస్పీ, తెలంగాణ జనసమితి, ప్రజాశాంతి పార్టీలు చీల్చే ఓట్లపై మిగిలిన పార్టీల గెలుపు అవకాశాలు ఆధారపడి ఉండటంతో ప్రధాన పార్టీలు తెగ ఆందోళన చెందుతున్నాయి. పైకి తమదే గెలుపు అని చెబుతున్నప్పటికి కచ్చితంగా తామ పార్టీ అభ్యర్థే గెలుస్తారని విశ్వాసంతో ఏ పార్టీ ముఖ్య నాయకులు చెప్పలేకపోతున్నారు.

ముఖ్యంగా టీఆర్ ఎస్ అభ్యర్థి పార్టీ బలాన్ని నమ్ముకుంటే.. బీజేపీ అభ్యర్థి బలాన్ని నమ్ముకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ, అభ్యర్థిపై ప్రజల్లో ఉన్న సానుభూతి, అభిమానాన్ని నమ్ముకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారా లేదా అనే దానికంటే గెలుపును డిసైట్ చేయడంలో హస్తం పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కీలకంగా మారతారనే చర్చ మాత్రం నియోజకవర్గంలో నడుస్తోంది. బీజేపీ నుంచి పోటీచేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయనతో పాటు కొంతమంది క్యాడర్ ను కూడా కమలం పార్టీలోకి తీసుకెళ్లినప్పటికి.. ఇంకా చాలా మంది కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు పార్టీలోనే ఉన్నారని, వారంతా రాజగోపాల్ రెడ్డికి తగిన గుణపాఠం చెబుతారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ఓట్లను వీలైనన్ని ఎక్కువ రాజగోపాల్ రెడ్డి తెచ్చుకోగలిగితే మాత్రం బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయానికి చేరవయ్యే అవకాశం ఉంటుంది. అదే కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును కోల్పోకుండా గతంలో వలె ఎక్కువ ఓట్లను సాధించగలిగితే టీఆర్ ఎస్ పార్టీకి విజయవకాశాలు మెండుగా ఉండనున్నాయి.

ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు రాజగోపాల్ రెడ్డి వైపు కాకుండా కాంగ్రెస్ వైపు గనుక ఏకపక్షంగా మళ్లితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినా ఆశ్చర్య పోవల్సిన అవసరం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మునుగోడు ఓటర్లలో చాలా మంది ఇప్పటికే ఏ అభ్యర్థికి ఓటు వేయాలనేదానిపై స్పష్టతతో ఉన్నప్పటికి పోలింగ్ కు ముందు రోజు వరకు వారి మనసు ఎటు మారుతుందనే దానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది. అయితే పోలింగ్ బూత్ కు వెళ్లే వరకు ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాల్లో డిసైడ్ చేసుకోని వారు కూడా ఉంటారు. కాని వీరి శాతం చాలా తక్కువ. ముఖ్యంగా యువత, విద్యావంతులు, ప్రయివేటు ఉద్యోగులు చాలా మంది తమ ఓటు ఎవరికో డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికి ఉప ఎన్నిక ప్రచార గడువు దగ్గరపడుతుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ పార్టీల అభ్యర్థులు పడుతున్న పాట్లు చూస్తుంటే మాత్రం కొంతమంది నవ్వుకుంటుంటే.. మరికొంతమంది మా నాయకుడికి ఎంత కష్టం వచ్చి పడిందో అని అనుకుంటున్నారంట. మునుగోడు ఓటర్ల మనసులో ఏముందనేది తేలాలంటే నవంబర్ 6వ తేదీ ఓట్ల లెక్కింపు వరకు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..