కర్నాటక డ్రగ్స్ కేసు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. పైలెట్ రోహిత్‌రెడ్డి, రఘునందన్‌రావు మధ్య సవాళ్లపర్వం కొనసాగుతోంది. అవినీతి అక్రమాలు, రాజీనామాలపై ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలతో పాలిటిక్స్ మరింత వేడెక్కాయి. ఇంతకీ తగ్గేదేలే అంటున్న ఈ సవాళ్లు ఎక్కడికి దారితీస్తాయి?
డ్రగ్స్ కేసులో బీజేపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే తానూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు BRS ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి. ఆరోపణలపై బీజేపీ నేతలు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానన్నారు. శనివారం బండి సంజయ్‌కు పెట్టిన డెడ్‌లైన్‌కు తగ్గట్లుగానే ఇవాళ మరోసారి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లారు రోహిత్‌రెడ్డి. బండిసంజయ్ రాలేదు కాబట్టి ఆయన తనపై తప్పుడు ఆరోపణలు చేశారన్నది స్పష్టమైపోయిందన్నారు.
తాను బండి సంజయ్‌కు ఛాలెంజ్ చేస్తే ఆయన రాకుండా రఘునందన్‌రావు ఆరోపణలు చేయడంపై తీవ్రంగా స్పందించారు రోహిత్‌రెడ్డి. తనకు సర్ఫాన్‌పల్లిలో ఫాంహౌస్, రిసార్ట్ ఉన్నాయని నిరూపిస్తే వాటిని ఆయనకు రాసి ఇచ్చేస్తానన్నారు. గతంలో ఎమ్మెల్యే రఘునందన్ అక్రమ వసూలు చేసేవారని..ఆయన వందల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు రోహిత్‌రెడ్డి.
ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సవాల్‌కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. తానూ అన్యాయంగా సంపాదించినట్లయితే ప్రభుత్వంతో దర్యాప్తు జరిపించవచ్చన్నారు. ఉడత ఊపులకు భయపడబోనన్నారు. తప్పుచేసిన రోహిత్‌రెడ్డికి శిక్షపడుతుందన్నారు.
కర్ణాటక డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని రోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు. బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవాలు లేవన్నారు. హిందుత్వం పేరుతో బండి సంజయ్ యువతను రెచ్చగొడుతున్నారన్న ఆయన..తాను నిజమైన హిందువుగా అమ్మవారి సాక్షిగా సవాల్ చేస్తే స్వీకరించలేదన్నారు. తెలంగాణ ప్రజలపై బీజేపీ నేతలు దొంగ ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థల ద్వారా వేధిస్తున్నారని ఆరోపించారు.
మొత్తానికి డ్రగ్స్ కేసు విషయంలో రోహిత్‌రెడ్డి, రఘునందన్ రావు మధ్య మాటల మంటలు తారాస్థాయికి చేరాయి. అవినీతి అక్రమాలపై ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..