T Congress: అడుగడుగునా అడ్డంకులు.. దుమ్ముగూడెం ముంపు ప్రాంతాల్లోకి సీఎల్‌పీ నేతలకు నో ఎంట్రీ..
దుమ్ముగూడెం వరద ముంపు ప్రాంతాలను సందర్శించేందుకు సీఎల్‌పీ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క నాయకత్వంలో బయలుదేరిన కాంగ్రెస్ బృందాన్ని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ సీఎల్‌పీ బృందం రోడ్డుపై బైఠాయించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎల్‌పీ బృందం పర్యటన ఉద్రిక్తతల మధ్య సాగింది. సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, పోడెం వీరయ్య ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరామ్‌నాయక్ తదితరులు భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన చేపట్టింది. ఉదయం భద్రాచలం శ్రీరాముడిని దర్శించుకొని ఈ బృందం బయలుదేరింది. ఈ పర్యటనకు అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి. సీఎల్‌పీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ముందుకు వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. చాలా చోట్ల రోడ్లు తవ్వి, డీసీఎం వాహనాలను అడ్డుపెట్టారు. మావోయిస్టుల కదలికలున్నాయని అంటూ పోలీసులు అడ్డుకున్నారు. వారం రోజుల ముందే పర్యటన గురించి పోలీసులకు చెప్పామని భద్రత కల్పించకుండా ఇలా అడ్డుకోవడమేంటని సీఎల్‌పీ బృందం ప్రశ్నించింది.
మూడు మార్గాల్లో పోలీసులు సీఎల్‌పీ బృందాన్ని అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఒకదశలో సీఎల్‌పీ బృందం రోడ్డుపై బైఠాయించింది. కార్లు ముందుకు తీసేందుకు కార్యకర్తలు ప్రయత్నించడం వాటిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది.
ముంపు ప్రాంతాల్లో తాము పర్యటించకుండా అడ్డుకోవడం ప్రభుత్వ బాధ్యతారహిత్యమని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షానికి అంతే బాధ్యత ఉంటుందని భట్టి అన్నారు. పేదలు ఓ వైపు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కోట్ల రూపాయలు ఉత్సవాల పేరుతో ఖర్చు చేస్తే ఉపయోగమేంటని భట్టి ప్రశ్నించారు.
భద్రాచలంలో కరకట్ట నిర్మాణానికి UPA ప్రభుత్వ హయాంలోనే అనుమతులు మంజూరయ్యాయని సీఎల్‌పీ బృందం తెలిపింది. భద్రాచలం నుంచి విడిపోయిన ఐదు గ్రామపంచాయతీల విషయంలో రాష్ట్రపతిని తాము త్వరలోనే కలుస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..