మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజిపేటలో కొద్దిరోజుల క్రితం ఓ రేషన్ షాప్ డీలర్ బియ్యం సరఫరా చేశారు. ఆ రేషన్ బియ్యం వెరైటీగా ఉండటంతో గ్రామస్తులు కంగారు పడిపోయారు. రేషన్ బియ్యంలోని వెరైటీ గింజలను వేరు చేసి.. నీటిలో నానబెట్టటంతో మెత్తగా పిండిపిండిగా మారాయి. ప్లాస్టిక్ ముద్దలా తయారవటంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. ప్లాస్టిక్ బియ్యం తిని బతకాలా చావాలా అంటూ మండిపడ్డారు. గత కొన్నిరోజులుగా ఇదే బియ్యం పిల్లలకు వండిపెడుతున్నామని చెప్పిన గ్రామస్తులు.. ఇలాంటివి తింటే ఆరోగ్య పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అయితే.. మెదక్ జిల్లాలోని ప్లాస్టిక్ బియ్యం ప్రచారంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. దానిపై మండల అధికారులతోపాటు.. రేషన్ షాపు డీలర్‌ను ఆరా తీశారు.
ఆపై.. కౌడిపల్లి మండలం రాజిపేట గ్రామంలో కలకలం రేపిన ప్లాస్టిక్ బియ్యం వ్యవహారంపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. అవి ప్లాస్టిక్ రైస్ కాదని.. ఫోర్టిఫైడ్ రైస్ అని తేల్చారు. చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందించే క్రమంలో.. అంగన్‌వాడీ కేంద్రాలకు పంపాల్సిన ఫోర్టిఫైడ్ రైస్‌ను రేషన్ డీలర్ పొరపాటున ప్రజలకు సరఫరా చేశారని తెలిపారు. అవి తినటం వల్ల ఎలాంటి ఇబ్బందులుండవని చెప్పారు. వాస్తవానికి.. పేదలకు పోషకాలు అందేలా కొన్నాళ్లుగా రేషన్‌లో ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ చేస్తోంది కేంద్రం. పైలెట్ ప్రాజెక్ట్ కింద పలు జిల్లాలను ఎంపిక చేసింది.
అయితే.. ఫోర్టిఫైడ్ రైస్‌పై ప్రజలకు అవగాహన లేక వాటిని తినటం మానేస్తున్నారు. మరికొందరు.. ప్లాస్టిక్ బియ్యమంటూ కంగారుపడిపోతున్నారు. రేషన్ బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ గింజలు తేలికగా వేరే రంగులో ఉండడం, అన్నం ముద్దగా అవుతుండటంతో అవి ప్లాస్టిక్ బియ్యమనుకొని వండుకోవడానికి వెనకాడుతున్నారు. కానీ.. ఫోర్టిఫైడ్ రైస్‌లో విరివిగా పౌష్టికాలు ఉంటాయని చెప్తున్నారు అధికారులు. మొత్తంగా.. కేంద్రం సప్లై చేస్తున్న ఫోర్టిఫైడ్ రైస్ గురించి, వాటిలోని పోషక విలువల గురించి ప్రజలకు అవగాహన లేకపోవడం ఇబ్బందిగా మారుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి