
నాగర్ కర్నూల్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. పంది కడుపులో ఏనుగు పిల్ల ఆకారంలో పిల్ల జన్మించింది. పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో ఈ సంఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కురాకుల వెంకటయ్య అనే వ్యక్తి పందులను పెంచుతూ జీవనోపాధి పొందుతున్నాడు. ఇంటి ఆవరణలోనే ఓ చిన్న పందిరి వంటి నిర్మాణంలో పందులను పోషిస్తూ ఆదాయం సమకూర్చుకుంటున్నాడు. అయితే అందులో ఒక పంది మొదటి ఈతలో ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. మొదట సంతోషం వ్యక్తం చేసిన యజమాని తర్వాత ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఏడు పంది పిల్లల్లో ఒకటి అచ్చం ఏనుగు ఆకారాన్ని పోలి ఉండడంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు.
అంతలోనే కుటుంబ సభ్యులు, స్థానికులకు విషయం తెలిసిపోయింది. ఆనోట ఈనోట గ్రామస్థులు తెలియడంతో ఏనుగు ఆకారంలో ఉన్న పందిపిల్లను చూసేందుకు పెద్ద ఎత్తున వెంకటయ్య ఇంటికి తరలివచ్చారు. అచ్చం ఏనుగు పిల్ల ఆకారాన్ని పందిపిల్ల పోలి ఉండడం విశేషం. తొండం ఆకారం, భారీ చెవులతో చూడగానే ఏనుగు పిల్ల అనేలా కనిపిస్తోంది. అయితే జన్మించిన కాసేపటికే ఆ పంది పిల్లతో పాటు మరో పంది పిల్ల సైతం మరణించింది. ప్రస్తుతం ఐదు పందిపిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయి.
ఇక ఏనుగు ఆకారాన్ని పోలి ఉన్న పందిపిల్ల అంశం స్థానికంగా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సోషల్ మీడియాలో ఆ పంది పిల్ల చిత్రాలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే అనుహ్యంగా పందిపిల్ల ఏనుగు ఆకారంలో జన్మించడానికి కారణాలను పశు వైద్యులు శోధిస్తున్నారు. జన్యుపరమైన అంశాలా? లేక ఇంకేమైన కారణాలు ఉన్నాయా అన్న కోణంలో ఆలోచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..