Telangana: భూకంపం రావద్దని భూమాతకు ప్రత్యేక పూజలు.. ఎక్కడో తెలుసా?

ఆ గ్రామాన్ని భూకంపం వణికించింది. ఇప్పటికే అక్కడ రెండు సార్లు భూమి కంపించింది.దీంతో ఆ గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమ గ్రామంలో మరోసారి భూ ప్రకంపనలు రావద్దని భూమాత శాంతించాలని ప్రత్యేక పూజలు చేశారు. భూమాతకు నైవేద్యాన్ని పెట్టి తమను రక్షించాలని వేడుకున్నారు. ఇంతకు ఆ గ్రామం ఏదో తెలుసుకుందాం పదండి.

Telangana: భూకంపం రావద్దని భూమాతకు ప్రత్యేక పూజలు.. ఎక్కడో తెలుసా?
Jagtial

Edited By:

Updated on: May 15, 2025 | 11:20 AM

సాధారణంగా మన దక్షిణ భారత దేశంలో భూకంపాలు రావడం అనేది చాలా అరుదు. అయితే ఇటీవల కాలంలో తెలంగాణలోని జగిత్యాలలో వచ్చిన భూకంపం అందరినీ తీవ్ర భయాందోళనకు గురిచేసింది. అయితే కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో ఇప్పటికీ రెండు సార్లు భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు వణికిపోతున్నారు. అయితే ఇక్కడి ప్రజలు ఒక నమ్మకాన్ని బాగా పాటిస్తారు. భూమాతకు బూరెలను నైవేద్యంగా చేసి పెడితే ఆ తల్లి శాంతించి భూ ప్రకంపనలు రాకుండా చూసుకుంటుందని వీరి నమ్మకం.

ఇక ఇటీవల రెండు సార్లు గ్రామంలో భూప్రకంపనలు రావడంతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి..ఆ తల్లికి బూరెలను నైవేద్యంగా పెట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గ్రామంలోని కొందరు మహిళలు బూరెలు చేసుకొని గ్రామ శివారులో ఉన్న ఒక చెట్టు వద్దకు చేరుకున్నారు. ఆ చెట్టు కింద మట్టిని తీసి అందులో ముగ్గువేసి, పసుపు కుంకుమ పెట్టి ఆ తర్వాత భూమాతకు బూరెలను నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ వీడియో చూడండి…

అయితే, భూమాతకు బూరెలంటే చాలా ఇష్టమని, వాటిని నైవేద్యంగా సమర్పిస్తే ఆ తల్లి శాంతిస్తుందని స్థానికులు చెబుతున్నారు. తమ గ్రామంలో మరోసారి భూకంపం రావద్దన్న ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని స్థానిక మహిళలు చెపుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..