
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్‌పై కాట శ్రీనివాస్ గౌడ్ వర్గం కార్యకర్తలు దాడి చేశారు. ఆఫీస్‌లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. సేవ్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. క్యాంప్‌లో ఉన్న కేసీఆర్ ఫోటోను తొలగించి సీఎం రేవంత్ ఫోటో పెట్టారు. ఇప్పటివరకు అక్కడ సీఎం రేవంత్ ఫోటో ఎందుకు లేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తీరుపై స్థానిక కాంగ్రెస్ నేతలు, కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరులు గుర్రుగా ఉన్నారు. నియోజకవర్గంలో మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రొత్సహిస్తున్నారని.. కాంగ్రెస్ శ్రేణులపై దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతకుముందు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం నేతలు, కార్యకర్తలకు నిరసన చేపట్టారు.ఎమ్మెల్యే అనుచరులు దాడి చేస్తున్నారని ఆరోపించారు. పాత, కొత్త నేతల మధ్య పంచాయితీ తేల్చాలని డిమాండ్ చేశారు. పటాన్‌చెరు చౌరస్తా దగ్గర బైఠాయించి ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తతలు తలెత్తకుండా అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి 2024 జూలైలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయన పార్టీలో చేరడం పటాన్ చెరు స్థానిక కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదు. అయితే స్థానిక నేతలకు నచ్చజెప్పి గూడెంను పార్టీలో చేర్చుకుంది కాంగ్రెస్ నాయకత్వం. అయితే ఆయన పార్టీలో చేరిన నుంచి తరుచూ ఎమ్మెల్యే అనుచరులు తమపై దాడికి దిగుతున్నారని స్థానిక కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరినా బీఆర్ఎస్ శ్రేణులను ప్రొత్సహిస్తున్నారన్నది పటాన్‌చెరు కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్‌గౌడ్ అనుచరుల వాదన. తమను ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఇబ్బందిపెడుతున్నారని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. పలుసార్లు గాంధీభవన్ వేదికగా కూడా మహిపాల్ రెడ్డి, కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరుల మధ్య గొడవలు జరిగాయి. ఇప్పటికే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై పటాన్ చెరు కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డికి, పీసీపీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలో ఇవాళ మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాట శ్రీనివాస్‌గౌడ్ వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో.. దీనిపై పార్టీ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.