TSRTC: బస్సులో చనిపోయిన ప్యాసింజర్.. మృతదేహాన్ని బస్సులోనే ఇంటికి చేర్చిన డ్రైవర్, కండక్టర్

Telangana: పక్క మనిషి చనిపోతుంటే ఫోటోలు, వీడియోలు తీసే కాలంలో ఉన్నాం మనం. కానీ చనిపోయిన వ్యక్తి పట్ల మానవత్వంతో వ్యవహరించారు ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి..

TSRTC: బస్సులో చనిపోయిన ప్యాసింజర్.. మృతదేహాన్ని బస్సులోనే ఇంటికి చేర్చిన డ్రైవర్, కండక్టర్
V. C. Sajjanar with RTC Staff

Updated on: Jun 17, 2023 | 7:54 PM

TSRTCకు ప్యాసింజర్స్ దైవంశ సంభూతుల‌ని, టిక్కెట్ తీసుకున్న ప్ర‌యాణీకుల‌ను క్షేమంగా, సుర‌క్షితంగా గ‌మ్య‌స్థానాల‌కు చేర్చాల్సిన బాధ్య‌త సిబ్బందికి ఉంద‌ని సంస్థ ఎంసీ సజ్జనార్ అన్నారు. విధి నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌యాణికుల‌కు మెరుగైన సేవ‌ల‌ను అందించ‌డంతో పాటు మాన‌వ‌త్వం చాట‌డంలోనూ సిబ్బంది స్ఫూర్తిదాయ‌కంగా నిలుస్తుండ‌టం మంచి ప‌రిణామ‌మ‌ని ఆయ‌న కొనియాడారు. బ‌స్సులో గుండెపోటుతో మ‌ర‌ణించిన ఓ ప్ర‌యాణికుడి మృత‌దేహాన్ని మాన‌వ‌తా దృక్ఫ‌థంతో వ్య‌వ‌హ‌రించి అదే బ‌స్సులో ఇంటికి చేర్చిన మ‌హ‌బూబాబాద్ డిపో కండ‌క్ట‌ర్ కె.నాగ‌య్య, డ్రైవ‌ర్ డి.కొముర‌య్య‌ల‌ను శ‌నివారం హైద‌రాబాద్‌లోని బ‌స్‌భ‌వ‌న్‌లో అభినందించారు. ఆ స‌మ‌యంలో ప్ర‌త్యేక చొర‌వ తీసుకున్న మ‌హ‌బూబాబాద్ డిపో మేనేజ‌ర్ విజ‌య్‌ను కూడా ప్ర‌శంసించారు. శాలువా, ప్ర‌శంసా ప‌త్రంతో పాటు ప్ర‌త్యేక బ‌హుమ‌తి అందించి వారి సేవ‌లు మెచ్చుకోద‌గిన‌వ‌ని కొనియాడారు.

బ‌స్సులో మృతదేహాన్ని తరలించడంలో సహకరించిన ప్రయాణికులకు కూడా ఆయ‌న ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు స్పందించే గుణం క‌లిగి ఉండ‌టం ప్ర‌తి ఒక్క సిబ్బందికి ఎంతో అవ‌స‌ర‌మని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వివ‌రాల్లోకి వెళితే, మహబుబాబాద్‌ డిపోకు చెందిన బస్సు ఈ నెల 14న‌ సాయంత్రం ఖమ్మం నుంచి మహబుబాబాద్‌కు ప్రయాణికులతో బయలుదేరింది. ఆ సమయంలో బస్సులో 52 మంది ప్రయాణికులున్నారు. కురవి మండలం మోదుగులగూడెనికి చెందిన కె.హుస్సేన్‌(57).. బస్సు మైసమ్మ గుడి దగ్గరికి రాగానే నిద్రలోనే గుండెపోటుకు గురయ్యారు. ఆ సమయంలో బస్సు కండక్టర్‌ కె.నాగయ్య, డ్రైవర్‌ కొమురయ్యలు సమయస్పూర్తితో వ్యవహారించారు. తోటి ప్రయాణికుల సాయంతో సీపీఆర్‌ నిర్వహించారు. లాభం లేకపోవడంతో 108కి సమాచారం అందించారు. అప్పటికే ప్రయాణికుడు మృతి చెందినట్లు వారు ద్రువీకరించారు. ఆ మృతదేహాన్ని బాధితుడి స్వగ్రామానికి తీసుకెళ్లడానికి 108 సిబ్బంది నిరాకరించారు. ఆ సమయంలో కండక్టర్‌, డ్రైవర్ ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి.. బస్సులోనే 30 కిలోమీటర్లు మృతదేహాన్ని జాగ్రత్తగా ఇంటికి చేర్చి ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇది సంస్థకు ఎంతో గర్వకారణమని సంస్థ‌ ఎండీ స‌జ్జ‌న‌ర్ చెప్పారు.

సిబ్బంది మానవత్వం చాటుకోవడం ద్వారా ప్రజలకు సంస్థపై విశ్వాసం పెరుగుతుందని ఆయ‌న పేర్కొన్నారు. సేవా భావంతో వ్య‌వ‌హ‌రిస్తున్న సిబ్బందికి సంస్థ‌లో త‌ప్ప‌క గుర్తింపు ఉంటుంద‌న్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..