CM KCR – BJP Govt: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 18 (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ సభల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశాయనున్నారు. టీఆర్ఎస్ పార్లమెంట్ (రాజ్యసభ, లోక్ సభ) సభ్యులతో శనివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇప్పటికే బీజేపీ సర్కార్‌పై ఆగ్రహంతో ఉన్న సీఎం కేసీఆర్ పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని సీఎం కేసీఆర్ ఎంపీలకు పిలుపివ్వనున్నారు. తెలంగాణకు అన్ని రంగాల్లో నష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పార్లమెంటు వేదికగా ఉభయసభల్లో పోరాటానికి పూనుకోవాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిపై సీఎం కేసీఆర్ ఇప్పటికే సమరశంఖం పూరించారు. కలిసివచ్చే అన్నిరాష్ట్రాల విపక్ష పార్టీలను సమన్వయం చేసుకుంటూ, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. దేశంలో ప్రమాదంలో పడుతున్న ఫెడరల్, సెక్యులర్ ప్రజాస్వామిక విలువలను కాపాడాలనే తన ప్రయత్నాలకు సీఎం కేసీఆర్ మరింత పదును పెట్టనున్నారు. ఆర్థిక సంక్షోభంలోకి దేశాన్ని నెట్టివేస్తున్న కేంద్ర వైఖరిని తేటతెల్లం చేసేందుకు సీఎం కేసిఆర్ కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకుని బీజేపీ కేంద్ర ప్రభుత్వ దమనీతిపై పోరాటం చేసేందుకు వ్యూహాలను రచిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ అప్రజాస్వామిక దమననీతిని తీవ్రంగా ఖండిస్తూ.. దేశవ్యాప్త నిరసనలతో కేంద్రం అసలు స్వరూపాన్ని బయటపెట్టేందుకు సీఎం కేసీఆర్ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
విపక్ష నేతలతో మంతనాలు..
దేశంలోని పలు రాష్ట్రాల విపక్ష నేతలతో సీఎం కేసీఆర్ ఫోన్లో మంతనాలు జరుపుతున్నారు. ఈ మేరకు శుక్రవారం నాడు పలువురు ముఖ్యమంత్రులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. అంతేకాకుండా పలువురు జాతీయ నేతలతో కూడా చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతోపాటు.. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సన్నిహితులతో, బీహార్ ఆర్జెడీ నేత తేజస్వీయాదవ్ తో, యుపీ ప్రతిపక్షనేత అఖిలేశ్ యాదవ్ తో, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా ఇతర జాతీయ విపక్ష నేతలతో స్వయంగా సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. కేంద్రంపై ప్రజాస్వామిక పోరాటంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రతిపాదనలకు పలు రాష్ట్రాల విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు సానుకూలంగా స్పందిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
కేంద్రం మెడలువంచి దేశంలో ప్రజాస్వామిక విలువలను కాపాడే దిశగా అన్ని విపక్ష పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేందుకు కేసీఆర్ మంతనాలు సాగుతున్నాయని పేర్కొంటున్నాయి. అటు వరదల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మంత్రులు అధికార యంత్రాంగానికి ఆదేశాలిస్తూనే.. ఇటు బీజేపీ అప్రజాస్వామిక విధానాల విపత్తునుంచి దేశాన్ని కాపాడేందుకు పార్లమెంట్ వేదికపై పోరాటానికి సీఎం సమాయత్తమవుతున్నారని గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..