Pamela Satpathy : యాదాద్రి భువనగిరి కలెక్టర్ గా పమేలా సత్పతి నియామకం అయ్యారు. ఇక్కడ కలెక్టర్ గా ఉన్న అనితా రామచంద్రన్ బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పమేలా సత్పతి ప్రస్తుతం వరంగల్ మున్సిపల్ కమీషనర్ గా పనిచేస్తున్నారు. 2019 డిసెంబర్‌లో వరంగల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సత్పతి నగరాభివృద్ధిపై చెరగని ముద్రవేశారని చెప్పాలి. ఆమె ముక్కుసూటితనం అనేక సార్లు ఆమెను రాజకీయ ఒత్తిళ్లకు గురయ్యారు. అయితే పదోన్నతిపై సత్పతి ఇక్కడి నుంచి వెళ్లడంతో జీడబ్ల్యూఎంసీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
వరంగల్ మహానగర పాలక సంస్థకు కమిషనర్‌గా పనిచేసిన ఐఏఎస్ అధికారులు కలెక్టర్‌గా పోస్టింగ్‌పై వెళ్లడం అనవాయితీగా వస్తోంది. సత్పతి విషయంలోనూ అదే జరగడం గమనార్హం. ఈమె జీడబ్ల్యూఎంసీ ఆరో మహిళా కమిషనర్‌గా సేవలందించారు. 1995లో తొలి మహిళా ఐఏఎస్ కమిషనర్‌గా శాలినీమిశ్రా రెండేళ్లు, తర్వాత వరుసగా నీతూప్రసాద్, స్మితా సభర్వాల్, వాకాటి కరుణ, శ్రుతి ఓజా తర్వాత సత్పతి బాధ్యతలు నిర్వహించారు. 2015 సంవత్సరంలో ఐఏఎస్ పూర్తి చేసుకున్న పమేలా సత్పతి తొలి పోస్టింగ్ భద్రాచలం సబ్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. అక్కడ ఆమె 19 నెలల పాటు పనిచేశారు. మూడు నెలల పాటు భద్రాచలం దేవస్థానం కార్యనిర్వాహణాధికారిగానూ కొనసాగడం గమనార్హం. ఆ తర్వాత 11నెలలు భూసేకరణ శాఖలో పని చేశారు.