Palm tree climber – Snake Bite: పాము కాటుతో ఒక గీతా కార్మికుడు చనిపోయాడు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన మద్దుల రాజ్ కుమార్ అనే గీతా కార్మికుడు ఎప్పటిలాగే కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కుతోన్న క్రమంలో పాము కాటు వేసింది. దీంతో అతన్ని హుటాహుటిన పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అయితే, రాజ్ కుమార్ పరిస్థితి విషమంగా మారడంతో కరీంనగర్‌లోని పెద్దాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
హైవే మీద చెరుకు లారీని ఆపి.. గంటపాటు తిన్న ఏనుగులు, బారులు తీరి నిలిచిపోయిన వాహనాలు
తమిళనాడులోని ఈరోడ్డు జిల్లా సత్యమంగళం దగ్గర హైవేపై ఏనుగులు రాత్రివేళ హాల్‌చల్ చేశాయి. మైసూరు జాతీయ రహదారిపై చెరుకు లోడుతో వెళుతున్న లారీని అడ్డగించిన తల్లి, పిల్ల ఏనుగులు.. లారీలో ఉన్న చెరుకును తినడం మొదలుపెట్టాయి. గంటకు పైగా రోడ్డుపైనే ఉన్న ఏనుగులు.. ఎలాంటి అదురూ.. బెదురూ లేకుండా నెమ్మదిగా తమ పని కానిచ్చుకున్నాయి.
దీంతో సత్యమంగళం వద్ద మైసూరు జాతీయ రహదారిపై గంటలపాటు ట్రాఫిక్ నిలిచి పోయింది. లారీలతోపాటు, అనేక వాహనాలు రోడ్డు మీదే నిల్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆకలితో ఏనుగులు హైవే మీదకు రావడం పరిపాటిగా మారిందని స్థానికులు చెబుతున్నారు.