AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బాల్యానికి విముక్తి.. ఆపరేషన్ ముస్కాన్‌తో 6,307 మంది చిన్నారుల ముఖాల్లో నవ్వులు!

ఒక చిన్నారి బడికి వెళ్లకుండా పనిలోకి వెళ్తున్నాడంటే.. అది ఆ కుటుంబ సమస్య మాత్రమే కాదు, సమాజం సాధించిన వైఫల్యం! అలాంటి వైఫల్యాన్ని అధిగమిస్తూ, బాల్యాన్ని బానిసత్వం నుంచి కాపాడేందుకు తెలంగాణ మహిళా భద్రత తన పెట్టి ఓ బృహత్తర కార్యం.. ఏకంగా 6,307 మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపింది. బానిసత్వం నుంచి భవిష్యత్తువైపు అడుగులు వేసేలా చేసింది.

Telangana: బాల్యానికి విముక్తి..  ఆపరేషన్ ముస్కాన్‌తో 6,307 మంది చిన్నారుల ముఖాల్లో నవ్వులు!
Operation Muskaan 12 Telangana
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Aug 01, 2026 | 8:55 PM

Share

బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా తెలంగాణ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్-12’ ఎట్టకేలకు ముగిసింది. జూలై 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో సుమారు 6,307 మంది చిన్నారులను పోలీసులు సురక్షితంగా రక్షించారు. మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో పోలీసు, మహిళా శిశు సంక్షేమ, కార్మిక, వైద్య శాఖలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, జిల్లా బాలల సంరక్షణ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా సమన్వయంతో పని చేసి ఈ ఆపరేషన్‌ను దిగ్విజయం చేశాయని మహిళా భద్రత విభాగం డైరెక్టర్ చారు సిన్హా వెల్లడించారు.

ఈ ఆపరేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 124 సబ్‌డివిజన్ పోలీసు బృందాలను ఏర్పాటు చేసి, 620 మంది పోలీసు సిబ్బంది, అధికారులకు ఎస్‌ఓపీలు (SOPs), సంబంధిత చట్టాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారని తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, దేవాలయాలు, ఇటుక బట్టీలు, మెకానిక్ షాపులు, నిర్మాణ ప్రదేశాలు, టీ దుకాణాలు, హోటళ్లు, ఢాబాలు, కిరాణా, ఆటోమొబైల్, మాంసం, పాదరక్షలు, వెల్డింగ్ వర్క్‌షాపులు, బేకరీలు వంటి ప్రాంతాలను గుర్తించి విస్తృత తనిఖీలు చేపట్టి అక్కడ పనిచేస్తున్న పిల్లలను రక్షించినట్టు తెలిపారు.

ఆపరేషన్‌లో రక్షించిన 6,307 మంది చిన్నారుల్లో 5,892 మంది బాలురు, 415 మంది బాలికలు ఉన్నారని.. వీరిలో 3,447 మంది తెలంగాణకు చెందినవారు కాగా, 2,860 మంది ఇతర రాష్ట్రాలు, నేపాల్‌కు చెందినవారు ఉన్నట్టు తెలిపారు. మొత్తం 5,041 మంది బాల కార్మికులు, ఒక బానిస కార్మికుడు, 647 మంది వీధి బాలలు, 43 మంది భిక్షాటన చేస్తున్న చిన్నారులు, 11 మంది ఇంటి నుంచి పారిపోయిన చిన్నారులు, డ్రాప్‌అవుట్లు, బాల్య వివాహాలు, అక్రమ దత్తత వంటి ఇతర విభాగాల్లో 563 మంది చిన్నారులను గుర్తించి రక్షించినట్టు పేర్కొన్నారు.

ఈ ఆపరేషన్ సందర్భంగా మొత్తం 1,705 కేసులు నమోదు చేసి, 1,710 మందిని అరెస్టు చేశామని.. ఈ కేసుల్లో 1,989 మంది చిన్నారులను రక్షించామన్నారు. కార్మిక శాఖ 1,381 తనిఖీ నివేదికలు జారీ చేయగా, కనీస వేతనాల చట్టం కింద రూ.37.95 లక్షల జరిమానాలు విధించిందనట్టు తెలిపారు. రక్షించిన చిన్నారుల్లో 5,737 మందిని కుటుంబాలకు అప్పగించగా, 570 మందిని బాలల సంరక్షణ కేంద్రాలకు తరలించినట్టు స్పష్టం చేశారు.

హోటళ్లు, ఢాబాలు, వీధి వ్యాపారాలు, నిర్మాణ రంగం, కిరాణా దుకాణాలు, ఆటోమొబైల్ రంగం, మాంసం దుకాణాలు, ఇటుక బట్టీలు, వెల్డింగ్ వర్క్‌షాపులు, బేకరీలు, పాదరక్షల దుకాణాలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ షాపులతో పాటు పాఠశాల మానేసిన చిన్నారులను కూడా గుర్తించి రక్షించినట్లు చారుసిన్హా తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా, బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనలో అన్ని శాఖల సమన్వయంతో తెలంగాణ మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచిందని మహిళా భద్రత విభాగం డైరెక్టర్ చారు సిన్హా పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Follow Us