ఒకే మ్యాచ్‌లో 14 వికెట్లు.. ఆస్ట్రేలియా పాలిట విలన్‌లా 18 ఏళ్ల టీమిండియా సంచలనం..!
18 ఏళ్ల భారత యువ స్పిన్నర్ తన్మయ్ బలోదా ఆస్ట్రేలియాపై యూత్ టెస్ట్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఒకే మ్యాచ్‌లో ఏకంగా 14 వికెట్లు పడగొట్టి కంగారూలను తీవ్రంగా దెబ్బతీశాడు. ఈ చారిత్రక బౌలింగ్‌తో టీమిండియా అండర్-19 జట్టుకు 10 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. తన్మయ్ స్పిన్ మాయాజాలం భవిష్యత్ టీమిండియాకు ఆశాకిరణం.

Tanmay Baloda: ఆస్ట్రేలియా గడ్డపై భారత యువ కెరటం విధ్వంసం సృష్టించాడు. కంగారూ బ్యాటర్లకు బంతి ఏ దిశగా తిరుగుతుందో అర్థం కాక క్రీజులోనే బిత్తరచూపులు చూసేలా చేశాడు 18 ఏళ్ల యువ స్పిన్నర్ తన్మయ్ బలోదా. ఏకంగా ఒకే మ్యాచ్‌లో 14 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి నడ్డి విరిచాడు. వరల్డ్ రికార్డు నమోదు చేస్తూ టీమిండియా అండర్-19 జట్టుకు ఏకపక్ష చారిత్రక విజయాన్ని అందించాడు. వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఊపును కొనసాగిస్తూ, రెండు మ్యాచ్‌ల అనాధికారిక యూత్ టెస్ట్ సిరీస్‌లోనూ భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో టెస్టులో తన్మయ్ విసిరిన స్పిన్ ఉచ్చులో చిక్కుకుని కంగారూలు ఘోరంగా మోకరిల్లారు.
తొలి ఇన్నింగ్స్‌లో 6.. రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు..!
తన్మయ్ వేసిన ప్రతి బంతి ఒక మిస్సైల్‌లా బ్యాటర్ల వికెట్లను గిరాటేసింది. కచ్చితమైన లెంగ్త్, అద్భుతమైన టర్న్‌తో మ్యాచ్ ఆద్యంతం బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు.
మొదటి ఇన్నింగ్స్: 25 ఓవర్లలో 11 మెయిడెన్లు వేసి కేవలం 32 పరుగులే ఇచ్చి 6 కీలక వికెట్లు నేలకూల్చాడు.
రెండో ఇన్నింగ్స్: ఏకంగా 2.06 ఎకానమీతో 8 వికెట్లు కూల్చి ఆసీస్ మిడిలార్డర్, టెయిలెండర్లను క్రీజులో నిలవకుండా చేశాడు. ఇందులో 5 మెయిడెన్ ఓవర్లు ఉన్నాయి.
మ్యాచ్ గణాంకాలు: ఒకే యూత్ టెస్ట్ మ్యాచ్‌లో మొత్తం 14 వికెట్లు సాధించి చరిత్ర సృష్టించాడు.
మ్యాచ్ హైలైట్స్..
తన్మయ్ దెబ్బకు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే ఆలౌట్ అయింది. చార్లీ హెండర్సన్ చేసిన 37 పరుగులే వారి ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్. భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 315 పరుగులు చేసి 141 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ తన్మయ్ విజృంభించడంతో ఆసీస్ జట్టు 151 పరుగులకే కుప్పకూలింది.
కేవలం 11 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత యువ జట్టు, కేవలం 0.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా టార్గెట్ పూర్తి చేసి 10 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.
భారత క్రికెట్‌లో మరో అద్భుతమైన స్పిన్ ఆణిముత్యం దొరికింది. ఆస్ట్రేలియా వంటి బలమైన ప్రత్యర్థిపై ఒంటిచేత్తో 14 వికెట్లు తీసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన తన్మయ్ బలోదా ప్రదర్శన భవిష్యత్ టీమిండియాలో అతని స్థానాన్ని స్పష్టంగా సూచిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
