Road Accident: తెలంగాణ వాసుల కాశీ పర్యటనలో విషాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ నుంచి కాశీకి వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. 38 మంది యాత్రికులతో మంగళవారం ట్రావెల్స్ బస్సు నిజామాబాద్ నుంచి కాశీయాత్రకు బయలుదేరింది. ఈ క్రమంలో బీహార్‌లోని ఔరంగబాద్‌కు చేరుకున్న తర్వాత ఓ హోటల్ వద్ద బస్సును ఆపేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది.
ఈ ఘటనలో నిజామాబాద్ జిల్లాలోని వెల్మడ్‌కు చెందిన వృద్ధురాలు సరలమ్మ (70) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ఐదుగురిని వెంటనే ఔరంగాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పర్యాటకులు కుటుంబసభ్యులకు తెలియజేశారు. కాగా ఈ బస్సులో నిజామాబాద్ జిల్లాలోని వెల్మల్, దత్తపూర్, తలవేద, డొంకేశ్వర్ గ్రామాలకు చెందిన వారితోపాటు నిర్మల్ జిల్లా బాసరకు చెందిన యాత్రికులు ఉన్నారు. దీంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి