యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలతో ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు. ఆలయ ఉద్ఘటన తర్వాత యాదగిరిగుట్టకు భక్తుల తాకిడి ఎక్కువైంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సాధారణ రోజుల్లో 30 వేలకు పైగా శని, ఆదివారం, సెలవు దినాల్లో 50 వేల మందికి పైగా భక్తులు దర్శించుకుంటున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు యాదగిరిగుట్టకు వస్తున్నారు. యాదగిరి గుట్టకు ట్రైన్ సౌకర్యం లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది భక్తులు ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ, సొంత వాహనాల్లోనూ వస్తున్నారు. యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ రైళ్లను నడపాలని భక్తులు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. భక్తుల కోసం ఘట్‌కేసర్ వరకు ఉన్న ఎంఎంటీఎస్ సేవలను రాయగిరి రైల్లేస్టేషన్ వరకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రైల్వేలైన్ నిర్మాణానికి 2016లో ప్రణాళికలు సిద్ధం చేసినా పట్టాలెక్కలేదు.
ఘాట్ కేసర్ నుంచి యాదాద్రి వరకూ రెండవ లైన్ పొడిగింపు
తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వంద శాతం కేంద్ర ప్రభుత్వం నిధులతో యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ ట్రైన్ ను పొడిగిస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన టెండర్లు కూడా ఖరారు అయ్యాయి. సికింద్రాబాద్ నుంచి ఘట్‌కేసర్ వరకూ ఎంఎంటీఎస్ రెండో దశ కింద 21కిలోమీటర్ల రైల్వే లైను నిర్మిస్తున్నారు. ఘట్‌కేసర్ నుంచి యాదాద్రి (రాయగిరి) వరకూ మరో 33 కి.మీ. రెండో దశను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందుకు 330 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల సమకూర్చే విషయంలో భేదాభిప్రాయాలు రావడంతో పొడిగింపు నిలిచిపోయింది. పెరిగిన ధరల దృష్ట్యా ప్రాజెక్టు వ్యయం ఇప్పుడు రూ.430 కోట్లకు చేరింది. రైల్వేశాఖ వంద శాతం నిధులతో రెండో దశ ఎంఎంటీఎస్ లైన్ పొడగింపును రైల్ వికాస్‌నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్) ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు 2023లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ సేవల విస్తరణపై అడుగు ముందుకు పడింది. ఘట్‌కేసర్ నుంచి యాదాద్రికి కొత్తగా మూడోలైన్ ఏర్పాటుచేయాల్సి ఉంది. ఇందుకు
భూసేకరణకు నోటిఫికేషన్ జారీచేసింది. భూసేకరణ పూర్తి కాగానే రైల్‌వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌బీఎన్‌ల్) ద్వారా పనులు చేపట్టనున్నారు.
మూడో రైల్వే లైన్ కోసం భూసేకరణ ప్రక్రియ..
ఘట్ కేసర్ నుండి యాదాద్రి వరకు మొత్తం 33కిలోమీటర్ల మూడో రైల్వే లైన్ కోసం సుమారు 60ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఘట్‌కేసర్ నుంచి రాయగిరి వరకు భూసేకరణ చేపట్టేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. రైల్వేలైన్ బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామం నుంచి భువనగిరి మండలంలోని పలు గ్రామాల మీదుగా ఈ రైల్వే మార్గం ఏర్పాటు కానుంది. ఎంఎంటీఎస్ రైల్వేలైన్‌తో వ్యవసాయ భూములు, ప్లాట్లు కోల్పోనున్న బాధితులకు పరిహారంపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
యాదాద్రి ఆలయ మోడల్ తో రైల్వేస్టేషన్ ముఖ ద్వారం
ఘట్‌కేసర్ నుంచి యాదాద్రి వరకూ చేపడుతున్న ఎంఎంటీఎస్ రెండవ దశ ప్రాజెక్ట్‌లో భాగంగా ఘట్‌కేసర్, బీబీనగర్, భువనగిరి, యాదాద్రి స్టేషన్లలో అదనపు మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ప్రస్తుతమున్న యాదాద్రి రైల్వేస్టేషన్‌లో నూతనంగా ప్లాట్‌ఫాం, స్టేషన్ ఇతర వసతులను కల్పించనున్నారు. ఇందుకోసం అవసరమైన అనువైన స్థలాన్ని అధికార బృందం పరిశీలించింది. ప్రత్యేకంగా యాదాద్రి రైల్వే స్టేషన్ ముఖ ద్వారాన్ని నిర్మించనున్నారు. యాదాద్రి క్షేత్ర ఆలయ మోడల్ ను రైల్వేస్టేషన్ ముఖ ద్వారంగా నిర్మించాలని అధికారుల బృందం నిర్ణయించింది.
ఈ పోస్ట్ పై క్లిక్ చేయండి..
The upgraded station will have the capacity to handle 25 pairs of trains and is designed with modern passenger amenities, including a spacious circulating area with adequate parking. It will be equipped with 5 lifts and 5 escalators to connect all platforms, as well as parcel… pic.twitter.com/VyBG2NPj9n
— G Kishan Reddy (@kishanreddybjp) October 20, 2024
ఎంఎంటీఎస్ రెండో దశ పొడిగింపు పనులు చేపట్టేందుకు కేంద్రం ముందుకు రావడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ పొడిగింపుతో స్వామివారి దర్శనానికి డబ్బు, సమయం ఆదా అవుతుందని భక్తులు చెబుతున్నారు. యాదాద్రి రైల్వే స్టేషన్ లో అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..