Telangana: గుర్రపు స్వారి నేర్చుకోవాలనుకుంటున్నారా? అద్భుత అవకాశం మీకోసం.. వివరాలివే..

|

Mar 25, 2023 | 7:23 PM

బైక్‍ రైడింగ్‍, కారు డ్రైవింగ్‌కు ఎన్నో శిక్షణా కేంద్రాలు ఉంటాయి. చాలా మంది వాటిని నేర్చుకునేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అదే బాటలో ఇప్పుడు గుర్రపు స్వారి కోసం శిక్షణ కేంద్రాలు కూడా వెలుస్తున్నాయి. దీంతో కనుమరుగౌతున్న గుర్రపు స్వారి, వాటిపై ఆసక్తి ఉన్న ఔత్సాహికులకు చేరువౌతోంది. నగరాలకే పరిమితమైన హార్స్ రైడింగ్ ఇప్పుడు పట్టణాలకు చేరుకుంది.

Telangana: గుర్రపు స్వారి నేర్చుకోవాలనుకుంటున్నారా? అద్భుత అవకాశం మీకోసం.. వివరాలివే..
Horse Riding
Follow us on

బైక్‍ రైడింగ్‍, కారు డ్రైవింగ్‌కు ఎన్నో శిక్షణా కేంద్రాలు ఉంటాయి. చాలా మంది వాటిని నేర్చుకునేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అదే బాటలో ఇప్పుడు గుర్రపు స్వారి కోసం శిక్షణ కేంద్రాలు కూడా వెలుస్తున్నాయి. దీంతో కనుమరుగౌతున్న గుర్రపు స్వారి, వాటిపై ఆసక్తి ఉన్న ఔత్సాహికులకు చేరువౌతోంది. నగరాలకే పరిమితమైన హార్స్ రైడింగ్ ఇప్పుడు పట్టణాలకు చేరుకుంది. మహబూబ్‍నగర్‍ శివారులో ఏర్పాటైన ఓ హార్స్ రైడింగ్‍ కోచింగ్‍ సెంటర్‍, గుర్రపు స్వారీ చెయ్యాలనుకునే వారి ఆసక్తిని కలిగిస్తోంది. అంతే కాదు అక్కడ ఉన్న పుష్పక్‍ అనే గుర్రం ఇటీవల బెంగుళూరులో జరిగిన పోటీల్లో జాతీయ స్థాయిలో 5వ బహుమతి గెలుచుకుంది. దీంతో ఆ శిక్షణా కేంద్రానికే పుష్పక్‍ అనే గుర్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మహబూబ్‌నగర్‌లో హార్స్ రైడింగ్ పై పెరుగుతున్న క్రేజ్‌పై ప్రత్యేక కథనం మీకోసం..

మహబూబ్‍నగర్‍ శివారులోని తాటికొండ వద్ద అన్సారీ హార్స్ రైడింగ్‍ కేంద్రం అందరినీ ఆకర్శిస్తోంది. నిర్వాహకుడు అన్సారీ ఏర్పాటు చేసిన హార్స్ ఫామ్‍‌లో ఉన్న పలు గుర్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక్కడ ఏర్పాటైన హార్స్ ఫామ్‍‌లో వివిధ జాతులకు చెందిన 13 గుర్రాలు ఉండగా అందులో రెండు మగ గుర్రాలు ఉన్నాయి. వాటన్నింటిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది పుష్పక్‍ అనే గుర్రం. దాదాపు రూ. 11 లక్షలు విలువగల ఈ గుర్రం తన ప్రత్యేకతను చాటుకుంది. ఈ నెల 10-11 తేదీల్లో బెంగుళూరులో జరిగిన గుర్రపు పందాల్లో జాతీయ స్థాయిలో 5వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఒక్క పరుగులోనే కాకుండా ఫిట్‍‌నెస్‍ మొదలుకుని, అన్ని విభగాల్లోనూ ఈ పుష్పక్‍ గుర్రం 5వ స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఈ హార్స్ ఫామ్‌కు మంచి గుర్తింపు వచ్చింది.

గుర్రాలకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి వ్యాయమం, రోలింగ్, క్లీనింగ్ తర్వాత బ్రేక్ ఫాస్ట్‌గా ఫీడ్ పెడతామని.. రోజుకు నాలుగు సార్లు నీళ్లు తాపుతామని, అన్ని విషయాలు టైం ప్రకారంగా జరుగుతాయని చెప్పారు హార్స్ ఫామ్ నిర్వాహకులు. ట్రైనింగ్ కూడా ఉదయం, సాయంత్రం ఉంటుందని చెబుతున్నారు ట్రైనర్.

ఇవి కూడా చదవండి

మహబూబ్‌నగర్‌లో గుర్రపుశాల ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇక్కడి ప్రజలకు గుర్రపు స్వారీని అందుబాటులోకి తీసుకురావడమే అని చెబుతున్నారు. రాయల్ స్పోర్ట్స్ అయిన గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఉండేందుకే ఈ గుర్రపుశాల ఏర్పాటు చేశామని, ప్రతి రోజు విద్యార్ధులు ఇష్టంగా ఇక్కడికి వచ్చి గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారని చెబుతున్నారు యజమాని ముదస్సీర్ అన్సారీ.

అయితే, గుర్రాల పోషణ, వాటితో శిక్షణ ఇప్పించడం అంత ఆషామాషి విషయమేమి కాదు. ఇతర ఫామ్‍‌లతో పోలిస్తే ఈ గుర్రపు ఫామ్‍ లను ఏర్పాటు చెయ్యడం ఓ రకంగా సాహసోపేతమనే చెప్పాలి. అంతే కాదు పెద్ద ఖర్చుతో కూడుకున్నది కూడా. ఒక్కొ గుర్రం ఎంత లేదన్నా లక్ష రూపాయలకు పైనే ఉంటుంది. ఇలా ఒకటి రెండు కాదు.. కనీసం పది వరకు గుర్రాలను అందుబాటులో ఉంచాల్సిందే. ఇక గుర్రలాను సాకడం కూడా ఓ సాహసోపేతమనే చెప్పాలి. వాటికి దాన అందించే విషయంలో ఏమాత్రం ఏమరపాటు ఉన్నా అది ప్రాణాలకే ప్రమాదమంటున్నారు నిర్వాహకులు. అలాగే వెటర్నరీ శాఖ నుంచి పెద్దగా సపోర్టు లేకపోవడం కూడా ఇబ్బంది కరంగా మారిందని, దానాతో పాటు వైద్యం కూడా అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అన్సార్‍ హార్స్ ఫామ్‍ నిర్వాహకులు.

ఈ హార్స్ రైడింగ్‍ శిక్షణా కేంద్రానికి వివిధ ప్రాంతాల నుంచి శిక్షణ తీసుకునేందుకు వస్తున్నారు. రాజుల కాలం నాటి రోజుల్లో ఉన్న ఈ గుర్రాల స్వారీ ఇప్పుడు వెనకబడ్డ పాలమూరు జిల్లాలో అందుబాటులోకి రావడం శుభ పరిణామమే అయినా ప్రభుత్వ సహకారం కూడా ఉండాల్సిన అవసరం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..