Adilabad MP Ticket: బీజేపీ తొలి జాబితాలో ‘సోయం’కు నో ఛాన్స్‌.. ఆదిలాబాద్‌ ఎంపీ సీటుపై ఉత్కంఠ

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. తెలంగాణ నుంచి తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ముగ్గురు సిట్టింగ్‌ ఎంపీలకు మళ్లీ పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. అయితే.. ఎస్టీ రిజర్వుడ్‌ అయిన ఆదిలాబాద్‌ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టడం చర్చకు దారితీస్తోంది. ఇంతకీ.. ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థిని ప్రకటించకపోవడం వెనకున్న ఆంతర్యమేంటి?

Adilabad MP Ticket: బీజేపీ తొలి జాబితాలో ‘సోయం’కు నో ఛాన్స్‌.. ఆదిలాబాద్‌ ఎంపీ సీటుపై ఉత్కంఠ
Soyam Bapurao

Updated on: Mar 03, 2024 | 10:01 AM

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. తెలంగాణ నుంచి తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ముగ్గురు సిట్టింగ్‌ ఎంపీలకు మళ్లీ పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. అయితే.. ఎస్టీ రిజర్వుడ్‌ అయిన ఆదిలాబాద్‌ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టడం చర్చకు దారితీస్తోంది. ఇంతకీ.. ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థిని ప్రకటించకపోవడం వెనకున్న ఆంతర్యమేంటి?…

ఎట్టకేలకు ఎంపీ అభ్యర్థుల ఫస్ట్‌ లిస్ట్‌ రిలీజ్‌ చేసింది బీజేపీ. తెలంగాణకు సంబంధించి ముగ్గురు సిట్టింగులు సహా తొమ్మిదిమంది పేర్లు ప్రకటించింది. కానీ.. సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న సోయం బాపూరావు పేరును ప్రకటించకపోవడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. సోయం పేరు పెండింగ్‌లో పెట్టడం వెనుక అంతర్యమేమిటనే ప్రశ్నలు తలెత్తతున్నాయి. పార్టీ పరంగా ఆదిలాబాద్‌ టికెట్‌ విషయంలో ముందు నుంచి రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఈ పార్లమెంట్‌ సెగ్మెంట్‌లోని బీజేపీ ఎమ్మెల్యేలు సోయం బాపూరావును వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం విస్తృతంగా ఉంది.

బాపూరావుకు కాకుండా మరెవరికైనా టికెట్‌ ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తులు చేసినట్లు చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో… ఆదిలాబాద్‌ ఎంపీగా పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. తమకు అవకాశం కల్పించాలని రాష్ట్ర నాయకత్వానికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. కొంతమందైతే తమకే టికెట్‌ వస్తుందనే నమ్మకంతో ప్రచారానికి ప్రత్యేక వాహనాలను సైతం సిద్ధం చేసుకున్నారు. అయితే.. ఆదిలాబాద్‌ నుంచి బరిలో నిలిచేందుకు ఎంతమంది అభ్యర్థులు పోటీ పడుతున్నప్పటికీ.. బాపూరావు మాత్రం ఇంకా తనకే టికెట్‌ వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలావుంటే… ఆదిలాబాద్‌ విషయంలో కొన్నాళ్లుగా ఆదివాసీ వర్సెస్‌ లంబాడీ వివాదం నడుస్తోంది. ఈ వివాదం తెరపైకి రావడానికి సోయం బాపూరావు తీరే కారణమన్న విమర్శలు లేకపోలేదు. అంతేకాదు.. మొన్నామధ్య.. ఎంపీ ఫండ్స్‌తో సొంత ఇల్లు కట్టుకున్నానని చెప్పి సెల్ఫ్‌ గోల్‌ అయ్యారు సోయం. ఈ క్రమంలో.. సోయంపై వ్యతిరేకతతోపాటు.. ఆదివాసీ, లంబాడీ సామాజికవర్గాల బ్యాలెన్స్‌ కోసం బీజేపీ హైకమాండ్‌ కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన.. ఆదిలాబాద్‌కు, మరో ఎస్టీ రిజర్వుడ్‌ అయిన మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానానికి లింక్‌ ఉంది. మహబూబాబాద్‌లో లంబాడా అభ్యర్థిని బరిలోకి దించుతారని, ఆదిలాబాద్‌లో ఆదివాసీ అభ్యర్థికి చాన్స్‌ ఇవ్వనున్నట్లు బీజేపీ నేతలు కొందరు చెప్పుకొస్తున్నారు.

వాస్తవానికి.. రేపు ప్రధాని మోదీ ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. దాంతో.. జిల్లాతో పాటు ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ప్రజలందరి దృష్టి మోదీ సభపైనే ఉంది. పార్టీ అభ్యర్థుల తొలి జాబితాలో ఆదిలాబాద్‌ అభ్యర్థిని కూడా ప్రకటించి మోదీ ఎన్నికల ప్రచారానికి ఇక్కడి నుంచే శ్రీకారం చూడుతారనే ప్రచారం సాగింది. అయితే.. అధిష్టానం మాత్రం ఆదిలాబాద్‌ విషయంలో ఆచీతూచి వ్యవహరిస్తోంది. కమలం పార్టీ ప్రకటించిన తొలి విడత జాబితాలో సోయంకు చోటు దక్కకపోవడంపై పార్టీ శ్రేణులతో పాటు రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

పార్టీ అధిష్టానం మదిలో ఏముందోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఆదిలాబాద్‌ టికెట్‌కు తీవ్ర పోటీ ఉండటంతోనే ఆయన పేరును ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టారనే టాక్‌ నడుస్తోంది. సోయం బాపూరావు స్థానంలో కొత్త అభ్యర్థినెవరినైనా బరిలోకి దింపుతారా అనే ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. మొత్తంగా.. ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థి ఎంపికలో బీజేపీ అధిష్టానం ఎలా ముందుకెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. రేపు మోదీ ఆదిలాబాద్‌ పర్యటన నేపథ్యంలో ఎంపీ అభ్యర్థి విషయంలో కొత్త నిర్ణయం ఏమైనా ఉంటుందా అన్నది చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…