Right To Disconnect: డ్యూటీ తర్వాత నో ఫోన్ కాల్స్, మెయిల్స్.. ఉద్యోగులూ ఊపిరి బిగపెట్టుకోండి ఇక.!
రిమోట్ వర్క్, హైబ్రిడ్ మోడల్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్… విధానం ఏదైనా సరే, డిజిటల్ యుగంలో ఉద్యోగులపై పని ఒత్తిడి మాత్రం తగ్గడం లేదు. ఒకవైపు లక్ష్యాల ఒత్తిడి, మరోవైపు కెరీర్ పోటీ… ఈ రెండింటి మధ్య ఉద్యోగుల వ్యక్తిగత జీవితం నలిగిపోతోంది. విశ్రాంతికి చోటు లేకుండా సాగుతున్న ఈ పరుగులో మానసిక, భావోద్వేగ, శారీరక సమస్యలు పెరుగుతున్నాయన్న..

కార్పొరేట్ కల్చర్ విస్తరించిన తర్వాత పని విధానంలో భారీ మార్పు వచ్చింది. గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం సాధారణమైంది. సమస్య అక్కడితో ఆగడం లేదు. అధికారిక పని గంటలు ముగిసిన తర్వాత కూడా ఆఫీస్ నుంచి ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, ఈమెయిల్స్, వాట్సాప్ సందేశాలు రావడం ఉద్యోగులకు సాధారణ అనుభవంగా మారింది. స్పందించకపోతే ఉద్యోగ భవితవ్యంపై ప్రభావం పడుతుందేమోనన్న భయం చాలామందిని వెంటాడుతోంది. ఈ పరిస్థితుల మధ్యే పని గంటలపై కార్పొరేట్ పెద్దల వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. వారానికి ఎక్కువ గంటలు పని చేయాలన్న సూచనలు వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌పై దేశవ్యాప్తంగా చర్చను మరింత ఉధృతం చేశాయి. ఇదే సమయంలో ఉద్యోగుల హక్కులపై కొత్త ఆశలు రేకెత్తిస్తూ ‘రైట్ టు డిస్కనెక్ట్’ బిల్లు తెరపైకి వచ్చింది.
లోక్‌సభ ముందుకు ‘రైట్ టు డిస్కనెక్ట్’ బిల్లు..
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే ఇటీవల లోక్‌సభలో ‘రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు–2025’ను ప్రవేశపెట్టారు. అధికారిక పని గంటలు ముగిసిన తర్వాత, అలాగే సెలవు దినాల్లో పని సంబంధిత కాల్స్, సందేశాలు, ఈమెయిల్స్, వీడియో కాల్స్‌కు స్పందించకుండా ఉండే హక్కు ఉద్యోగులకు చట్టబద్ధంగా కల్పించాలన్నదే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. డిజిటలైజేషన్ వల్ల ఉద్యోగులు ఎప్పుడూ అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు. పని సమయానికి మించి కూడా సేవలు పొందుతూ అదనపు చెల్లింపులు చేయని సంస్థల విధానాలకు అడ్డుకట్ట వేయడమే ఈ బిల్లులోని ముఖ్య లక్ష్యమని తెలిపారు. అధిక పనిభారం వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించి, ఆరోగ్యకరమైన పని–జీవిత సమతౌల్యతను ప్రోత్సహించడమే ‘రైట్ టు డిస్కనెక్ట్’ ఆలోచన సారాంశం.
అమలే అసలైన సవాల్..
ఈ బిల్లు కార్పొరేట్ ఉద్యోగుల్లో కొత్త ఆశలను రేపుతున్నప్పటికీ, అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చట్టం వచ్చినంత మాత్రాన సంవత్సరాలుగా పాతుకుపోయిన పని సంస్కృతి మారిపోతుందోనన్న ప్రశ్న నిపుణులు లేవనెత్తుతున్నారు. అవాస్తవిక లక్ష్యాలు, సిబ్బంది కొరత, సమయ నిర్వహణ లోపాలు వంటి సమస్యలు పరిష్కరించకపోతే బిల్లులో లొసుగులు మిగిలిపోతాయని వారు అభిప్రాయపడుతున్నారు. కార్యాలయాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడాలంటే చట్టంతో పాటు సంస్థల ఆలోచనా విధానంలోనూ మార్పు రావాల్సిందేనని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. ఉద్యోగుల శ్రేయస్సును కేంద్రంగా పెట్టిన ఆచరణాత్మక విధానాలే నిజమైన మార్పుకు దారి తీస్తాయని అంటున్నారు.
బిల్లులోని ముఖ్య అంశాలు..
అధికారిక పని గంటల తర్వాత, సెలవు రోజుల్లో ఆఫీస్ కాల్స్, వీడియో కాల్స్, ఈమెయిల్స్, సందేశాలను ఉద్యోగులు తిరస్కరించవచ్చు. స్పందించలేదని కారణంగా ఉద్యోగులపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై జరిమానా విధించే ప్రతిపాదన ఉంది. పని సమయానికి మించి పనిచేస్తే ఓవర్‌టైం చెల్లింపుతో పరిహారం కల్పించాలి. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక సంక్షేమ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచన. పనివేళల తర్వాత సంప్రదింపులపై పరస్పర అంగీకారంతో మార్గదర్శకాలు రూపొందించే కమిటీ ఏర్పాటు అయింది. ఇప్పటికే ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, స్పెయిన్, ఇటలీ, బెల్జియం, పోర్చుగల్, కెనడాలోని ఒంటారియో రాష్ట్రం, మెక్సికో వంటి దేశాల్లో ఇప్పటికే ‘రైట్ టు డిస్కనెక్ట్’ తరహా నిబంధనలు అమల్లో ఉన్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..








