అత్యంత రద్దీ కలిగిన హైవేకు మోక్షం.. జూలై 1నుంచి టోల్ వసూళ్లు చేసేది వీళ్లే..

| Edited By: Srikar T

Jun 28, 2024 | 3:46 PM

దేశంలోనే అత్యంత వాహనాల రద్దీ కలిగిన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు మోక్షం కలిగింది. ఈ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఆరు లైన్ల విస్తరణ పనుల కోసం కాంట్రాక్టర్ ఖరారు అయ్యేవరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టోల్ వసూలు చేయనుంది.

అత్యంత రద్దీ కలిగిన హైవేకు మోక్షం.. జూలై 1నుంచి టోల్ వసూళ్లు చేసేది వీళ్లే..
Toll Charges
Follow us on

దేశంలోనే అత్యంత వాహనాల రద్దీ కలిగిన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు మోక్షం కలిగింది. ఈ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఆరు లైన్ల విస్తరణ పనుల కోసం కాంట్రాక్టర్ ఖరారు అయ్యేవరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టోల్ వసూలు చేయనుంది. ప్రస్తుత గుత్తేదారు జీఎంఆర్ సంస్థ స్థానంలో ఎన్ఎహ్ఏఐ జూలై ఒకటవ తేదీ నుంచి ఈ టోల్ చార్జీలను వసూలు చేయనుంది.

ఉమ్మడి రాష్ట్రంలో 9 నెంబర్ జాతీయ రహదారిగా పేరున్న హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి యాక్సిడెంట్లకు కేరాఫ్ అడ్రస్‎గా ఉండేది. రెండు లైన్లుగా ఉన్న ఈ హైవేను రూ.1740 కోట్లతో బీవోటీ పద్ధతిన జీఎంఆర్ సంస్థ నాలుగు లైన్లుగా విస్తరించింది. విస్తరణ సమయంలోనే ఆరు లైన్లకు సరిపడా భూసేకరణ జరిపారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు 181 కిలోమీటర్ల పొడవున రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించింది. 2012లో తెలంగాణలో పంతంగి, కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలతో టోల్ వసూలు చేస్తోంది. జీఎంఆర్‎ టోల్ వసూలుకు 2025 జూన్ వరకు గడువు ఉంది. అయితే 2024 వరకు NH65ను ఆరు లైన్లుగా విస్తరించేలా ఆ సంస్థతో ఒప్పందం కుదిరింది.

ఆరు లైన్ల విస్తరణపై కోర్టుకు వెళ్లిన జీఎంఆర్..

తెలుగు రాష్ట్రాల విభజనతో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, ఈ నేపథ్యంలో హైవేను ఆరు లైన్లుగా విస్తరించడం కష్టమని జీఎంఆర్ కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర విభజనతో ఇసుక లారీలు రాకపోకలు తగ్గిపోయాయని, దీంతో రోజుకు రూ.20 లక్షల చొప్పున నెలకు రూ.6 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోందని ఈ సంస్థ తరఫు న్యాయవాదులు వాదించారు. గడువు కన్నా ముందే టోల్ వసూలు బాధ్యత నుంచి వైదొలగేందుకు జీఎంఆర్ అంగీకరించింది. దీనికి ఆ సంస్థకు నష్టపరిహారం చెల్లించేందుకు NHAI ఒప్పందం చేసుకుంది.

జులై నుండి టోల్ వసూలు చేయనున్న NHAI..

హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరణ పనులు చేపట్టే సంస్థను ఖరారు అయ్యేవరకు టోల్ వసూలు చేయాలని NHAI నిర్ణయించింది. ఇందుకు మూడు నెలలపాటు తాత్కాలిక ప్రాతిపదికన టోల్ వసూలుకు రెండు ఏజెన్సీలను NHAI ఎంపిక చేసింది. తెలంగాణలోని పంతంగి, కొర్లపహాడ్లలో టోల్ వసూలు బాధ్యతను స్కైల్యాబ్ ఇన్‎ఫ్రా, ఏపీలోని చిల్లకల్లులో కోరల్ ఇన్‎ఫ్రా సంస్థలు ఎంపికయ్యాయి. NHAI ఆధ్వర్యంలో ఈ ఏజెన్సీలు టోల్ చార్జీలను వసూలు చేయనున్నాయి.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ..

ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా వెళుతున్న NH65ను ఆరు లైన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ తీసుకున్నారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కరిని ఒప్పించి ఆరు లైన్ల విస్తరణకు నిధులు తెప్పించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఈ హైవేపై ఉన్న 17 బ్లాక్ స్పాట్స్ వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిద్దుబాటు పనులకు ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. బ్లాక్ స్పాట్స్ దిద్దుబాటు పనులను రామ్ కుమార్ సంస్థ చేపడుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..