తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్! కారణం ఇదే
Telangana Bandh July 24: నీట్ పరీక్ష అవకతవకలు, వరుస పేపర్ లీకేజీలకు నిరసనగా జూలై 24న తెలంగాణవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, NTA రద్దుతో పాటు పలు డిమాండ్లను విద్యార్థి సంఘాలు ముందుకు తెచ్చాయి.

దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ పరీక్ష అవకతవకలు, వరుస పేపర్ లీకేజీల వ్యవహారంపై విద్యార్థి లోకం ఆగ్రహంతో రగిలిపోతోంది. విద్యా వ్యవస్థలో చోటుచేసుకుంటున్న పదే పదే లోపాలపై విద్యార్థి సంఘాలు సమరశంఖం పూరించాయి. పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 24న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది.
ఈ బంద్‌లో SFI, AISF, NSUI, PDSU, AIFDS, AISB, AIPSU వంటి ప్రముఖ విద్యార్థి సంఘాలన్నీ ఏకమై భాగస్వామ్యం వహిస్తున్నాయి. దేశ విద్యా వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన వరుస వైఫల్యాలకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని వామపక్ష, విపక్ష విద్యార్థి సంఘాల నాయకులు విమర్శించారు. ఇటీవల ఢిల్లీలో తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై పోలీసులు జరిపిన దాడులను వారు తీవ్రంగా ఖండించారు. ఈ పోలీసు దాడులపై పారదర్శకమైన, స్వతంత్ర విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
దీంతోపాటు విద్యా వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా, అధికారాన్ని కేంద్రీకరించేలా ఉందంటూ VBSA బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఐక్యవేదిక డిమాండ్ చేసింది. జూలై 24న చేపట్టే ఈ రాష్ట్రవ్యాప్త బంద్ ద్వారా కేంద్ర వైఖరిపై తమ నిరసన గళాన్ని గట్టిగా వినిపించేందుకు సిద్ధమయ్యారు. విద్యా రంగాన్ని పరిరక్షించుకోవడానికి జరుగుతున్న ఈ పోరాటానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజలందరూ పెద్ద ఎత్తున మద్దతు తెలిపి, బంద్‌ను విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిచ్చారు.
