హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ తీరంలోని నెక్లెస్ రోడ్డులో ‘నీరా కేఫ్’ సిద్ధమైంది. 450 గజాల్లో నిర్మించారు. నీరా అమ్మకాలతో పాటు.. తెలంగాణ వంటకాల స్టాళ్లు ఉంటాయి. పై అంతస్తులో ఒక మీటింగ్ రూమ్, రెస్టారెంటును ఏర్పాటు చేశారు. తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో సిద్ధమైన నీరాకేఫ్.. ఈ నెలలో ప్రారంభమవ్వాల్సి ఉంది. అయితే.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాయిదా పడింది. నెక్లెస్ రోడ్డు లో రూ. 13 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ నీరా కేఫ్‌ను సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించనున్నారు. తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన స్వచ్ఛమైన నీరాను ప్రాసెస్ చేసి ఈ కేఫ్‌లో అమ్మనున్నారు. ఒకే సారి 300 నుంచి 500 మంది వరకు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు.
కాగా.. తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి నీరా కేఫ్ ఇదే కావటం విశేషం. కేఫ్ నుంచి ట్యాంక్ బండ్‌లోని బుద్ధ విగ్రహం వరకు బోటింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. నీరా ఉత్పత్తి, విక్రయాల కోసం లైసెన్సులను ప్రస్తుతం గౌడ సంఘం సభ్యులకు మాత్రమే ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రకృతి ప్రసాదితమైన కల్లుకు బ్రాండ్ తీసుకొస్తే.. గౌడ కులవృత్తి పరిశ్రమ స్థాయికి ఎదుగుతుందన్న సర్కారు ఉద్దేశం ఈ నీరా కేఫ్ తో తీరబోతోందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నీరాలో.. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, ప్రొటీన్, షుగర్ ఉన్నాయి. ఇది అత్యంత పోషకమైనదిగా చెబుతుంటారు. వ్యాధులను నివారించే ఔషధ గుణాలు కూడా ఇందులో అధికంగా ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది. షుగర్, లివర్, గుండె సమస్యల వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం