సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్లే వాహనాలతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి సందడిగా మారింది. సంక్రాంతి పండుగ అంటే మూడు రోజుల ముచ్చటైన పండుగ కోసం పట్టణాల నుంచి పల్లెల బాట పడుతున్నారు ప్రజలు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి వేలాది కుటుంబాలు తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలకు వెళుతున్నాయి. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ మినహా మిగతా అన్ని ప్రాంతాలకు రోడ్డుమార్గంలో వెళ్లే వారికి ఇదే ప్రధాన రహదారి కావడంతో వాహనాలు బారులు తీరాయి.
ప్రయాణికులతో హైవే వెంట ఉన్న హోటల్స్ కిక్కిరిసిపోయాయి. ఈ జాతీయ రహదారిపై సాధారణంగా ప్రతిరోజు 40 వేల వాహనాలు వెళ్తుంటాయి. నిన్న ఒక్కరోజే 60వేల వాహనాలు వెళ్లినట్లు చెబుతున్నారు రవాణా శాఖ అధికారులు. పంతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తం 16 టోల్ బూతులు ఉండగా, విజయవాడ వైపు 12 టోల్ బూతులను తెరిచారు హైవే అధికారులు. హైవేపై రద్దీతో ట్రాఫిక్ జామ్ ఏర్పడనప్పటికీ వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి.త్వరగా తమ సొంతూళ్లకు వెళ్లాలనుకున్న వారికి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..