
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తూప్రాన్లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ప్రసంగంలో భాగంగా ప్రతి మాటకు ముందు నా కుటుంబ సభ్యులారా అని తెలుగులో మాట్లాడి ప్రజలను ఆకర్షించారు. ముందుగా రైతుల గురించి ప్రస్తావించారు. రైతులు కేసీఆర్ సర్కార్‌పై ఆగ్రహంతో ఉన్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారని గుర్తుచేశారు. గత తొమ్మిదేళ్లుగా బీజేపీ అధికారంలో ఉండటంతో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందన్నారు. కేసీఆర్ గజ్వేల్ వదిలి కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు అని ప్రశ్నించారు.
అమేథీ నుంచి రాహుల్ పారిపోతే.. గజ్వేల్ నుంచి కేసీఆర్ పారిపోయారని విమర్శించారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని మాట ఇచ్చిన కేసీఆర్ దానిని విస్మరించారన్నారు. అలాగే దళిత బంధు పేరుతో దళిత సామాజిక వర్గాన్ని మోసం చేశారన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తానని ఆ పథకాన్ని పక్కన పెట్టేశారన్నారు. కేవలం ఫాం హౌస్‌కే పరిమితం అవుతూ, రాష్ట్ర సచివాలయానికి కూడా వెళ్లడం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యేందుకు.. ప్రజలతో మమేకం అవ్వని ముఖ్యమంత్రి మనకు అవసరమా.. సచివాలయానికి వెళ్లని ముఖ్యమంత్రి మనకు అవసరమా అంటూ తెలుగులో ప్రసంగించారు. దీంతో బహిరంగ సభ వద్ద ఉన్న బీజేపీ కార్యకర్తల్లో సరికొత్త జోష్ నిండింది.
కేసీఆర్ అవకాశం వచ్చిన ప్రతిసారి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ వచ్చారని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కుటుంబ పాలన, అవినీతిని కలిగి ఉందన్నారు. అలాగే ఈ రెండూ ఒక్కటే జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించారు. బీజేపీ వల్ల మాత్రమే తెలంగాణ గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీల నుంచి తెలంగాణను రక్షించాలంటే బీజేపీనే సరైన పార్టీ అని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాలకు సమానంగా న్యాయం చేసేది ఒక్క బీజేపీయే అని తెలిపారు. తెలంగాణలో బీజేపీకి అధికారం ఇస్తే మొట్టమొదటి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తుందని హామీ ఇచ్చారు.