తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద పోటెత్తుతోంది.. చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. రోడ్లు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది.. కొన్ని ప్రాంతాల్లో భారీ వరదలతో.. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో.. జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలదిగ్భందమయ్యాయి. అయితే.. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది.. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు, పోలీసు సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. నిరంతరాయంగా పనిచేస్తూ.. వరదల్లో చిక్కుకుపోయిన ప్రజల్ని రక్షిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే.. వరద నీటిలో చిక్కుకున్న ఓ వ్యక్తిని కాపాడేందుకు.. ఇద్దరు పోలీసులు, ఓ యువకుడు తమ ప్రాణాలను పణంగా పెట్టారు.. ఈ ఘటన నాగర్‌కర్నూల్‌లో చోటుచేసుకుంది. వాగు పొంగిపొర్లుతుండగా.. అటుగా వెళ్లిన ఓ వ్యక్తి నీటిలో కొట్టుకుపోయాడు.. సమచారం అందుకున్న హెడ్ కానిస్టేబుల్ తకియుద్దీన్, కానిస్టేబుల్ రాము వెంటనే స్పందించారు.
నాగనూల్ వాగు వద్ద 50 ఏళ్ల ఓ వ్యక్తి బ్రిడ్జిని దాటడానికి ప్రయత్నిస్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. వాగులో కొట్టుకుపోతూ.. కల్వర్టు చివరన రెయిలింగ్ పట్టుకొని ఆగిపోయాడు.. ఈ క్రమంలో అతడిని గమనించిన కానిస్టేబుళ్లు.. వెంటనే రంగంలోకి దిగారు.. ఇద్దరు పోలీసులు కల్వర్టు మధ్యలోకి చేరుకోగా, ఒక వ్యక్తి నీటి ప్రవాహాన్ని ఆపడానికి వారి సమీపంలో కారును ఆపాడు.. ఇలా.. కారు డోర్ పట్టుకున్న యువకుడితోపాటు.. కానిస్టేబుళ్లు చైన్‌గా ఏర్పడి.. ఆ వ్యక్తిని వరద ప్రవాహాం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆ వ్యక్తిని నెమ్మదిగా నీళ్లలోంచి బయటకు తీసి కారు లోపలికి తీసుకెళ్లారు.
నాగర్ కర్నూల్ నాగనూల్ వాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోతుండగా తక్షణమే స్పందించి ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి కాపాడిన హెడ్ కానిస్టేబుల్ తకీయొద్దీన్, కానిస్టేబుల్ రాములను జిల్లా ఎస్పీ, గౌరవ డిజిపి శ్రీ డా.జితేందర్, ఐపీఎస్ అభినందించారు.#TelanganaPolice pic.twitter.com/Q6cfVseWbf
— Telangana Police (@TelanganaCOPs) September 1, 2024
అయితే.. తమ ప్రాణాలను పణంగా పెట్టి వ్యక్తిని కాపాడిన ఇద్దరు పోలీసు సిబ్బందిని డిజిపి డా.జితేందర్ ప్రశంసించారు.. దీనికి సంబంధించిన వీడియోను తెలంగాణ పోలీస్ ట్విట్టర్లో షేర్ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..