ఈ పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చుతో పెళ్లి చేయొచ్చు..

| Edited By: Srikar T

Jul 21, 2024 | 8:16 PM

పెళ్లి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎంతో ఖరీదైపోతున్నాయి. మనదేశంలో చదువు కంటే కూడా పెళ్లి కోసమే ఎక్కువ ఖర్చుపెడుతున్నారు. ఇంతకు మించిన అజ్ఞానం మరొకటి ఉండదు మరి. 2022- 2023 ఏడాదిలో దేశంలో జరిగిన వివాహాలకు 4.72 ట్రిలియన్ డాలర్ల ఖర్చు అయినట్లు అంచనా వేస్తున్నారు. అది కాస్త 2023-2024 ఏడాదికి వచ్చేసరికి 5.52 ట్రిలియన్లకు పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.

ఈ పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చుతో పెళ్లి చేయొచ్చు..
Marriage
Follow us on

పెళ్లి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎంతో ఖరీదైపోతున్నాయి. మనదేశంలో చదువు కంటే కూడా పెళ్లి కోసమే ఎక్కువ ఖర్చుపెడుతున్నారు. ఇంతకు మించిన అజ్ఞానం మరొకటి ఉండదు మరి. 2022- 2023 ఏడాదిలో దేశంలో జరిగిన వివాహాలకు 4.72 ట్రిలియన్ డాలర్ల ఖర్చు అయినట్లు అంచనా వేస్తున్నారు. అది కాస్త 2023-2024 ఏడాదికి వచ్చేసరికి 5.52 ట్రిలియన్లకు పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ముస్లిం సామాజికవర్గంలో అయితే పెళ్లి తంతు ఎన్నో అనర్థాలకు కారణమవుతోంది. వివాహాలకు మాత్రం వధువు కుటుంబంపైనే ఎక్కువ భారం పడుతోంది. దీంతో ఆడబిడ్డల పేరెంట్స్ ఆర్థికంగా చితికిపోతున్నారు. పెళ్లి శుభలేఖ దగ్గర నుంచి మండపాలంకరణ వరకు, పెళ్లిబట్టల నుంచి నగల వరకు, టిఫిన్ల దగ్గర నుంచి విందు భోజనాల వరకు అన్నింటా ప్రత్యేకంగా ఉండాలనే స్టేటస్‎కు పోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అర్థరాత్రి దాటిన తరువాత బారాత్‎ల హంగామా పోలీసులకూ తలనొప్పిగా మారాయి. ఇంట్లో పెళ్లీడుకొచ్చిన అమ్మాయి ఉందంటే చాలు పెళ్లి ఖర్చుల గురించి పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. అమ్మాయి పెళ్లితో ఎంతోమంది పేరెంట్స్ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వరుడి తల్లిదండ్రులు పెట్టే డిమాండ్స్ తీర్చేందుకు అమ్మాయి పేరెంట్స్ లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. హైదరాబాద్ సిటీలో ముస్లిం సామాజికవర్గం వివాహ వేడుకల్లో సంస్కరణలు చేపట్టేందుకు ఉలమాలు ముందడుగు వేశారు. ప్రవక్త సాంప్రదాయిక పద్ధతిలో వివాహాలను జరిపిస్తే ఖర్చు తగ్గించుకోవచ్చని ఉలమాలు చెబుతున్నారు. ‘మస్నూన్ నికాహ్ తహ్రీక్’ పేరుతో ఉద్యమాన్ని చేపట్టారు. ఈ మేరకు ఆదివారం పాతబస్తీ చార్మినార్ సమీపంలోని గుల్జార్ ఫంక్షన్ హాల్లో ఉలమాలు సమావేశమయ్యారు.

పెళ్లి, వలీమా వేడుకల పేరుతో జరుగుతున్న వృథా ఖర్చుకు అడ్డుకట్ట వేసేందుకు ఉలమాలు పలు తీర్మానాలు చేశారు. ‘అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన వివాహమే శుభవంతమైనది’ అన్న ముహమ్మద్ ప్రవక్త ప్రవచమే ప్రేరణగా తమ పిల్లల పెళ్లిళ్లు జరిపించాలని జమాఅతె ఇస్లామీహింద్ తెలంగాణ ఉపాధ్యక్షులు హాఫిజ్ రషాదుద్దీన్ అన్నారు. పెళ్లిని సులభతరం చేసి, వివాహ వేడుకల్లో అనవసరమైన, మంగ్నీ, మెహందీ, హల్దీ, బారాత్ లాంటి దురాచారాలను అరికట్టాలని సమావేశం తీర్మానించింది. వివాహాన్ని మస్జిదులో చేసి అమ్మాయి తల్లిదండ్రులకు విందు ఖర్చు లేకుండా చేయాలని తీర్మానించారు. పెళ్లిలో విందు లేకుండా జరిగే పెళ్లిళ్లను ప్రోత్సహించాలని, అబ్బాయి తరపు వారు ఇచ్చే వలీమా విందును నిరాడంబరంగా జరిపించాలని ఉలమాలు పిలుపునిచ్చారు. పెళ్లి వేడుకల్లో బ్యాండు బాజాలు, బాణాసంచా కాల్పులు, వీడియోగ్రఫీ, ఖరీదైన వేదికలు లేకుండా తక్కువ ఖర్చుతో పెళ్లిళ్లు జరిపించాలని ఉలమాలు తీర్మానించారు. ఈ సమావేశంలో ముస్లిం సామాజికవర్గానికి చెందిన పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు మౌలానా ఖాలిద్ సైఫుల్లా రహ్మానీ, మౌలానా జాఫర్ పాషా సానీ, హాఫిజ్ రషాదుద్దీన్, ఎంపీజే స్టేట్ ప్రెసిడెంట్ అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఉస్మాన్ ఈ ఉద్యమానికి కన్వీనర్‎గా వ్యవహరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..