Telangana: తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు మునుగోడు చుట్టూనే తిరుగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు మునుగోడులో ఉప ఎన్నిక వస్తే ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలో వ్యూహాలను సిద్ధం చేసుకుంది. ప్రధాన పార్టీలైన టీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎవరనేది ఇప్పటికే స్పష్టంకాగా.. ఇక టీఆర్ ఎస్ మాత్రం అధికారికంగా అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దాదాపుగా TRS అభ్యర్థి కావచ్చనే చర్చ నడుస్తోంది. ఈక్రమంలో అధికార టీఆర్ ఎస్ పార్టీకి మునుగోడు నియోజకవర్గంలో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అధికారపార్టీకి చెందిన టీఆర్ ఎస్ నాయకులు బీజేపీలో చేరగా.. తాజాగా పార్టీకి చెందిన మండలస్థాయి కీలక నాయకులు కమలం పార్టీలో చేరారు. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్ లో పలువురు టీఆర్ ఎస్ నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. చండూరు జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం, గట్టుప్పల్ ఎంపీటీసీ అవారి శ్రీనివాస్, ఉడుతలపల్లి ఉప సర్పంచి గంట తులసయ్యలు రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.
ఈనెలలో మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వస్తుందని, అక్టోబర్ లో ఎన్నిక జరుగుతుందనే ప్రచారం నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు మునుగోడు పై ఫోకస్ పెట్టాయి. శాసనసభ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉడటం, దానికి ముందు జరగనున్న ఎన్నిక కావడంతో గెలుపును అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతంలో మునుగోడులో బలంగా ఉన్న వామపక్షాలు ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ కు మద్దతు ఇస్తామని ప్రకటించారు. దీంతో తమ గెలుపు నల్లేరుపై నడకేనన్న భావనలో అధికార టీఆర్ ఎస్ ఉంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై నియోజకవర్గ ప్రజల్లో ఉన్న సానుభూతి, వ్యక్తిగత ఇమేజ్ తో పాటు.. తెలంగాణలో టీఆర్ ఎస్ ను ఢీకొట్టగలిగే శక్తి బీజేపీకే ఉందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని, ఇవే తమను గెలిపిస్తాయనే ధీమాలో కమలం పార్టీ ఉంది. మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న ఆదరణ, కార్యకర్తల బలమే తమను మునుగోడులో విజేతగా నిలుపుతాయని కాంగ్రెస్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. మొత్తం మీద రోజులు గడుస్తున్న కొద్ది మునుగోడులో మాత్రం పొలిటికల్ క్లైమట్ హీటెక్కుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..