తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇప్పుడు పార్టీలన్నీ మునుగోడు పై ప్రత్యేక దృష్టి పెట్టాయి. టీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ ఉండనుంది. అయితే బీఎస్పీ పార్టీతో పాటు మరికొన్ని చిన్నా, చితక పార్టీలు, ఇండిపెండోంట్ అభ్యర్థులు భారీగా పోటీలో ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనేదానిపై క్లారిటీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికల ఎమ్మెల్యే అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ నుంచి కోమటి రెడ్డిరాజగోపాల్ రెడ్డి పోటీలో ఉండనున్నారు. ఆయన పేరును బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనేదానిపై పూర్తి క్లారిటీ ఉండటంతో ఇక అందరిచూపు టీఆర్ ఎస్ పైనే ఉంది. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చాలా మంది దాదాపు ఓ నలుగురు ఇక్కడి టికెట్ ను ఆశిస్తున్నారు. అయితే వీరిలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సీఏం కేసీఆర్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు సీఏం కేసీఆర్ జాతీయ పార్టీకి సంబంధించిన ప్రకటనను అక్టోబర్ 5వ తేదీ మధ్యాహ్నం చేయనున్నారు. ఈసందర్భంగా ఆయన మీడియానుద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థిని కూడా సీఏం కేసీఆర్ ప్రకటించే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కంచర్ల కృష్ణారెడ్డి పోటీపడుతున్నారు. అయితే పార్టీ హైకమాండ్ మాత్రం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కానీ మునుగోడులో స్థానిక ప్రజాప్రతినిధులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇప్పటికే కొంతంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్ ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. అభ్యర్థి ప్రకటన తర్వాత ఈ చేరికలు మరిన్ని ఉండే అకవాశం ఉన్నట్లు సమాచారం.
మునుగోడు ఉప ఎన్నికలో అభ్యర్థికి సంబంధించి మంగళవారం సీఏం కేసీఆర్ పార్టీ ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత చుండూరులో భారీ బహిరంగ సభకు కూడా టీఆర్ ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మునుగోడు ఉప ఎన్నికకు సమయం సమీపిస్తుండటంతో తెలంగాణ రాజకీయం అంతా మునుగోడు చుట్టూ తిరుగుతోంది. ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల కాకముందు నుంచే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వాస్తవానికి మునుగోడులో టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ బలం ఉంది. బీజేపీకి మాత్రం ఆర్ ఎస్ ఎస్, దాని పరివార్ సంస్థలకు చెందిన వ్యక్తులు మినహా క్షేత్రస్థాయిలో అంతగా బలం లేదు. కాని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ అభ్యర్థి కావడం బీజేపీకి ఈ నియోజకవర్గంలో కలిసొచ్చే అంశం. దీనికి తోడు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఈటల రాజేందర్, రఘునందన్ వంటి ఉద్యమ నేతలు బీజేపీలో ఉంటూ.. టీఆర్ ఎస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులను కమలం పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ కూడా తమపార్టీ గెలుపునకు దోహదం చేస్తుందనే నమ్మకంలో కమలం పార్టీ ఉంది.
టీఆర్ ఎస్ మాత్రం అభివృద్ధి మంత్రాన్ని నమ్ముకుంది. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమమే తమను గెలిపిస్తాయని నమ్ముతున్నప్పటికి.. ప్రజల మూడ్ రోజురోజుకు మారడం, ప్రభుత్వంపై అనేక అంశాల్లో పెరుగుతున్న వ్యతిరేకత తమకు నష్టం కలిగిస్తయనే భావనలోనూ టీఆర్ ఎస్ ఉంది. ప్రస్తుతం నియోజకవర్గంలో గెలుపును ప్రభావితం చేయలేకపోయినా, అరకొరగా ఉన్న కమ్యూనిస్టులు టీఆర్ ఎస్ కు మద్దతు తెలపడం ఆపార్టీకి సానుకూలంశమే. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే తమకు క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉందని, నాయకులు పార్టీని వీడినా, కార్యకర్తలు మాత్రం పార్టీతోనే ఉన్నారని హస్తం పార్టీ భావిస్తోంది. రేవంత్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినా.. అది ఎంత వరకు వర్కౌట్ అవుతుందనేది వేచి చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..