
మునుగోడు ఉప ఎన్నికలో ప్రతి ప్రక్రియ సెన్సేషన్‌గా మారుతోంది. అవును, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మునుగోడులో ఓటు కోసం దరఖాస్తులు వచ్చాయట. ఉప ఎన్నికపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టడంతో కొత్త ఓటర్లు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. స్థానికులే కాకుండా.. పక్క జిల్లాలు, పక్క రాష్ట్రాల నుంచి కూడా అప్లికేషన్‌లు పోటెత్తాయని టాక్ వినిపిస్తోంది. అయితే, భారీగా వస్తున్న కొత్త దరఖాస్తులపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి అప్లికేషన్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది.
మునుగోడులో రచ్చ చేస్తున్న ఈ కొత్త ఓట్ల సంగతేంటో చూద్దాం.. మునుగోడు ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌కు అగ్నిపరీక్షగా మారింది. అందుకే ఓటరుకు ఎక్కడలేని డిమాండ్ పెరిగింది.
ప్రస్తుతం మునుగోడు పరిస్థితి ఎలా ఉందంటే.. ఒక్క ఓటు ఉంటే చాలు వేల రూపాయలు వచ్చి పడతాయి. హీనపక్షం అనుకున్నా.. ఒక్కో పార్టీ ఒక్కో ఓటుకు పదివేలకు తక్కువ కాకుండా ఇస్తాయని ప్రచారం జరుగుతోంది. మరికొందరేమో..పది వేల నుంచి 30 వేల వరకు ఓటు ధర పలకొచ్చని నియోజకవర్గం మొత్తం టాక్ నడుస్తోంది. అందుకే ఓటు నమోదు కార్యక్రమం జాతరను తలపిస్తోంది. స్థానికులే కాదు.. పక్క జిల్లాలు, పక్క రాష్ట్రాల్లో ఉన్న మునుగోడు ఓటర్లు.. ఆన్‌లైన్, మీ సేవా కేంద్రాల ద్వారా ఓటు నమోదు, బదిలీ చేసుకుంటున్నారు. దీంతో.. ఎన్నికల సంఘానికి ఓటు కోసం దరఖాస్తులు వేలల్లో వచ్చిపడుతున్నాయి.
ఎంత లేదన్నా ఒక్కో ఓటుకు మూడు పార్టీల నుంచి 30 వేలు కచ్చితంగా వస్తుందని నియోజకవర్గం మొత్తం మాట్లాడుకుంటున్నారు. అందుకే ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా స్పీడందుకుంది. నామినేషన్ల హంగామా కంటే.. ఓటు నమోదు కోలాహలమే మునుగోడులో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నెల నాలుగవ తేదీ నాటికే 24 వేల కొత్త దరఖాస్తులు వచ్చాయంటే.. మునుగోడు ఓటు డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది.
ఏడాదిన్నర క్రితం జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు కేవలం15 కొత్త అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. కానీ మునుగోడు ఉప ఎన్నికకు 24 వేల దరఖాస్తులు వచ్చాయంటే.. అట్లుంటది మునుగోడు ఉప ఎన్నిక అని జనం గుసగుసలాడుకుంటున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొత్త ఓటర్ల దరఖాస్తులు రావడంతో ఎన్నికల సంఘం సీరియస్ అయింది. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించారు. బోగస్ ఓట్లను తొలగిస్తామంటున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే అన్ని అస్త్రాలను రాజకీయ పార్టీలు ప్రయోగిస్తున్నాయి.. మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థులకు ఎంత టెన్షన్ పెడుతుందో ఏమో కానీ.. అంతకంటే ఎక్కువ జోష్ ఓటర్లలో కనిపిస్తోంది.అందుకే ఓటు హక్కు కోసం జనం దరఖాస్తులతో పోటెత్తారట.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..