
Telangana Politics: బీజేపీ తెలంగాణ కమిటీ సభ్యుడు కిడ్నాప్ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. కుషాయగూడలో నివాసం ఉంటున్న ముక్కెర తిరుపతిరెడ్డి బీజేపీలో యాక్టివ్‌గా ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అయితే గురువారం మధ్యాహ్నాం అల్వాల్ ఎమ్మార్వో ఆఫీస్ సమీపంలో తిరుపతిరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్టుగా భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. ఈ కిడ్నాప్ చేయించింది మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి అని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మరి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లికి, ఈ తిరుపతిరెడ్డికి ఉన్న సంబంధం ఏంటి..? ఎక్కడ వీరి మధ్య తగాదాలు మొదలయ్యాయి..? అసలు మైనంపల్లి డైరెక్ట్ ఇన్‌వాల్వ్ అయ్యాడా..? లేదంటే ఎవరితో అయిన కిడ్నాప్ చేయించాడా..? లేదంటే కావాలనే మైనంపల్లి హన్‌మంత్ రావు మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారా..? మరి పోలీసులు చెబుతున్న దాని ప్రకారం అయితే తిరుపతిరెడ్డి ఒక్కడే స్వయంగా ఆటో ఎక్కి వెళ్లాడు.. ఎందుకు..?
తిరుపతిరెడ్డి గురువారం మధ్యాహ్నం అల్వాల్ ఎమ్మార్వో ఆఫీస్ నుండి బయటకు రాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కంగారుపడిన అనుచరులు, కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మార్వో ఆఫీస్ దగ్గరకు కారులో వచ్చిన తిరుపతిరెడ్డి ఐదు నిమిషాల్లోనే ఒక ఆటోలో ఒంటరిగా వెళ్లినట్టు అక్కడి సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు పోలీసులు. ఆటోలో నుంచి ఘట్‌కేసర్‌లో దిగిన తిరుపతిరెడ్డి.. అక్కడి నుంచి సూర్యాపేటకు బస్సులో వెళ్లినట్టు గుర్తించారు.. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాడు అనేది బయటపడితే ఈ కేసు చిక్కుముడి వీడినట్టే అని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఘట్‌కేసర్ పరిధిలోని సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. నాలుగు టీమ్స్‌గా ఏర్పడి తిరుపతిరెడ్డి ఆచూకీ కోసం ఎస్వోటీ, అల్వాల్ పోలీసులు గాలిస్తున్నారు.
కాగా.. తిరుపతిరెడ్డిని ఓ భూవివాదం కేసులోనే కిడ్నాప్ చేసి ఉంటారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పాకాల కుంటలో తిరుపతిరెడ్డికి ఓ విలువైన స్థలం ఉంది. కొన్ని నెలల క్రితం మామిడి జనార్థన్ అనే వ్యక్తిపై తిరుపతిరెడ్డి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఓ మూడెకరాల భూమిని జనార్థన్ అనే వ్యక్తి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తున్నారు కుటుంబసభ్యులు.
ఇక, తిరుపతిరెడ్డి కిడ్నాప్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదు అని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చెబుతున్నారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. తిరుపతిరెడ్డి అనే వ్యక్తి నేర చరిత్ర ఉంది. ఆయనపై 11 కేసులన్నాయని, అతని బాధితులు వస్తే పరిశీలించాలని పోలీసులకు చెప్పానన్నారు మైనంపల్లి. ఇది మనుసులో పెట్టుకొని తన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇంట్లో నుంచి ఆటోలో వెళ్లి కిడ్నాప్ డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.
పోలీసుల ఎంక్వైరీ ప్రకారం చూస్తే.. తిరుపతిరెడ్డి కిడ్నాప్ అయినట్టుగా కనిపించడం లేదని భావిస్తున్నారు. కిడ్నాప్ చేస్తే ఒక్కడే ఒంటరిగా ఆటోలో ఎందుకు వెళ్తాడు. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది..? దీని వెనక ఎమ్మెల్యే హస్తం ఉందనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..