
సిపిఆర్‌తో మనుషుల ప్రాణాలే కాదు మూగజీవుల ప్రాణాలు కూడా రక్షించవచ్చని వరంగల్‌లో నిరూపతమైంది. విద్యుతాఘాతానికి గురై స్తంభంపై నుండి నేల రాలిపడ్డ ఓ వానరం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడింది. అక్కడున్న ఆటో డ్రైవర్ తోపాటు స్థానికులు ఇది గమనించి వెంటనే సపర్యలు చేపట్టారు. కోతికి సిపిఆర్ చేసి పునర్జన్మను ప్రసాదించారు. దాదాపు 15 నిమిషాల పాటు స్పృహ తప్పి పడిపోయిన ఆ కోతి, సిపిఆర్ చేసిన తర్వాత లేచి చెంగుచెంగున ఎగురుతూ చెట్లపైకి మళ్లీ పరుగులు పెట్టింది. ఈ విచిత్ర సంఘటన చూసిన ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. కోతికి సిపిఆర్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
ఈ వింత సంఘటన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయం ముందు జరిగింది. వానరసేనలు గుంపుగా సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వానరం విద్యుత్ షాక్ కు గురై స్తంభంపై నుండి కిందపడి గిలగిల కొట్టుకుంటోంది. ఇది చూసి అక్కడున్న వారు చలించి పోయారు. పదిహేను నిమిషాలకు పైగా కొట్టుమిట్టాడిన వానరం చివరకు స్పృహతప్పి పడిపోయింది. అక్కడి సీన్ చూస్తే.. ఆ వానరం చనిపోయిందనుకుని అంతా భావించారు. పక్కనే ఉన్న వానరాలు పెద్దఎత్తున అరుస్తున్నాయి..
ఈ క్రమంలో ఆ వానరాన్ని గమనించిన అక్కడి మునిసిపల్ డోజర్ డ్రైవర్ హరీశ్ తోపాటు, మరో శానిటేషన్ జవాన్ మల్లికార్జున్ అప్రమత్తమై ఆ మూగజీవిని బ్రతికించేందుకు మానవ ప్రయత్నం చేశారు. సిపిఆర్ చేసి మూగజీవానికి ప్రాణం పోశారు. వానరానికి సిపిఆర్ చేయడం చూసి అంతా షాక్ అయ్యారు. ఆ వానరం బతకడం అసాధ్యమని వదిలేయండని కొందరు ఎగతాళి చేశారు. కానీ శానిటేషన్ జవాన్ తోపాటు మునిపల్ డ్రైవర్ వానరంపై జాలితో మానవ ప్రయత్నం చేశారు. చివరకు వారి ప్రయత్నం ఫలించింది. ఆ వానరానికి పునర్జన్మ లభించింది.
15 నిమిషాల పాటు సిపిఆర్ చేసిన తర్వాత హఠాత్తుగా కళ్ళు తెరిచిన వానరం.. అక్కడ నుండి లేచి చెంగుచెంగున పరుగులు పెట్టింది. పైకి ఎగురుతూ మళ్లీ చెట్లపైకి పరుగులు పెట్టింది. ఈ విచిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. మెడికల్ అండ్ హెల్త్ అధికారి సిహెచ్ రాజిరెడ్డి ఆ కోతికి సిపిఆర్ చేసిన సిబ్బందిని డ్రైవర్ ను అభినందించారు. ఆపద సమయంలో ఇదే విధంగా మనుషులకైనా, మూగజీవులకైనా ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించడం సాటి మనిషిగా మన బాధ్యతాన్ని గుర్తుచేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..