Telangana: వానరానికి కరెంట్ షాక్.. వెంటనే CPR చేసిన స్థానికులు.. కాసేపటికి…
నారాయణపేట జిల్లా మక్తల్‌లో హృదయాన్ని హత్తుకునే ఘటన వెలుగుచూసింది. కరెంట్ షాక్‌తో చెట్టు మీద నుంచి కిందపడి స్పృహ కోల్పోయిన వానరానికి అక్కడి మున్సిపల్ సిబ్బంది, స్థానికులు సీపీఆర్ చేసి ప్రాణం పోశారు. కాసేపటికే లేచిన వానరం మళ్లీ గంతులేస్తూ వెళ్లిపోవడం అందరికీ ఆనందాన్నిచ్చింది.

ఈ మధ్య సీపీఆర్ అనే మాటను తరచూ వింటున్నాం. గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ సమయంలో.. ఈ అత్యవసర ప్రాథమిక చికిత్సపై ఇప్పటికే వైద్యులు, ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నారు. దీని కారణంగా అనేక మంది ప్రాణాలు రక్షించే అవకాశం కలుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే హఠాత్తుగా ప్రాణాలు పోతున్న వ్యక్తికి.. చివరి క్షణాల్లో ఇది గోల్డెన్ ప్రాథమిక చికిత్స అని చెప్పవచ్చు.
ఇలాంటి సీపీఆర్ చేసి ఓ వానరం ప్రాణాలను రక్షించారు మున్సిపల్ కార్మికులు, స్థానికులు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఈ అపురూపమైన మానవత్వం వికసించిన ఘటన చోటుచేసుకుంది. మక్తల్ తహసిల్దార్ కార్యాలయం సమీపంలో శుక్రవారం ఉదయం చెట్టుపై వానరం అటు ఇటు గంతులు వేస్తూంది. అయితే చెట్ల మధ్యలో కరెంట్ తీగలకు తగలడంతో కరెంట్ షాక్‌కు గురైంది. దీంతో ఒక్కసారి చెట్టుపై నుంచి కిందపడి స్పృహ కోల్పోయింది. దీంతో అక్కడే ఉన్న మున్సిపల్ సిబ్బందితో పాటు స్థానికులు వానరాన్ని గమనించారు. వెంటనే దానికి సీపీఆర్ పద్ధతిలో ఛాతిపై గట్టిగా నొక్కారు. అలా చేసిన కాసేపటికే వానరం స్పృహలోకి వచ్చింది. కాసేపటికీ పూర్తిగా కోలుకొని గంతులేస్తూ అక్కడి నుంచి వెళ్లింది.
చెట్టుపై నుంచి కిందపడిన వానరం తిరిగి ప్రాణాలతో లేచి గంతులేయడాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్లు ఆనందం వ్యక్తం చేశారు. ప్రాణి ఏదైనా మానవతా దృక్పథంతో సీపీఆర్ చేసి వానరానికి ప్రాణం పోసినందుకు మున్సిపల్ సిబ్బంది, స్థానికులకు అభినందనలు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రతి ప్రాణికి సీపీఆర్ ఎంతో ముఖ్యమని ఈ ఘటన రుజువు చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




