Janwada Farm House: జన్వాడ ఫామ్‌హౌస్ కేసులో కీలక పరిణామం.. నెక్స్ట్ జరిగేది అదేనా..?
ఎక్సైజ్ పోలీసుల ముందు విచారణకు రాజ్ పాకాల తోపాటు నాగేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఇప్పటివరకు విజయ్ మద్దూరి కేవలం ఒకసారి మాత్రమే మోకిలా పోలీసుల ముందు హాజరయ్యాడు.
కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జన్వాడ పార్టీ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజ్ పాకాలకు చెందిన ఇంట్లో జరిగిన పార్టీపై అటు మోకిలా పోలీసులు, ఇటు ఎక్సైజ్ పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసుల ముందు రాజ్ పాకాల హాజరయ్యాడు. అయితే కేసు నమోదై ఐదు రోజులు గడుస్తున్నా, ఇప్పటికీ విజయ్ మద్దూరి సెల్‌ఫోన్ మాత్రం లభ్యం కాలేదు. అతడి సెల్‌ఫోన్ కోసం పోలీసులు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు.
అయితే ఈ కేసులో తాజాగా శుక్రవారం రోజు ఎక్సైజ్ పోలీసుల ముందు విచారణకు రాజ్ పాకాల తోపాటు నాగేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఇప్పటివరకు విజయ్ మద్దూరి కేవలం ఒకసారి మాత్రమే మోకిలా పోలీసుల ముందు హాజరయ్యాడు. అయితే ఈ మొత్తం పార్టీలో విజయ్ మద్దూరికి మాత్రమే డ్రగ్ పాజిటివ్ వచ్చింది. దీంతో అసలు విజయ్ మద్దూరి డ్రగ్స్ ఎక్కడ తీసుకున్నాడు అనే విషయంపై పోలీసులు వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం విజయ్ మద్దూరి సెల్‌ఫోన్‌ను కీలక ఆధారంగా పోలీసులు భావిస్తున్నారు.
కానీ విజయ్ మద్దూరి పోలీసులనే తప్పుదోవ పట్టించి తన మొబైల్ ఫోన్ కి బదులు మరొకరి సెల్‌ఫోన్‌ను పోలీసులకు సబ్మిట్ చేశాడు. దీంతో అసలు విజయ్ మద్దూరికి డ్రగ్స్ ఎలా వచ్చింది అనే విషయంపై ఇప్పటికి ఇంకా క్లారిటీ రాలేదు. అతడికి డ్రగ్స్ సరఫరా చేసిన డ్రగ్ పెడ్లరు ఎవరు అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. విజయ్ మద్దూరి సెల్‌ఫోన్ చుట్టూనే కేసు మొత్తం తిరుగుతుంది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో మాత్రం తనకు రాజ్ పాకాలనే డ్రగ్స్ ఇచ్చాడు అని పోలీసులు ఎస్ఐఆర్ కాపీలో సైతం పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం విజయ్ మద్దూరి సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తను అలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని పేర్కొన్నాడు. దీంతో అసలు విజయ్ మద్దూరికి డ్రగ్స్ ఎలా వచ్చాయి అనే వ్యవహారంపై ఇప్పటికి సస్పెన్స్ వీడలేదు.
విజయ్ మద్దూరి సెల్‌ఫోన్ పోలీసుల చేతికి వస్తేనే అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది. ఒకవేళ పార్టీలో డ్రగ్స్ తీసుకోలేదు అనుకుంటే మరి విజయ్ మద్దూరికి డ్రగ్ పాజిటివ్ ఎలా వచ్చింది. పార్టీకి వచ్చే ముందే డ్రగ్స్ తీసుకున్నాడా లేదా ఆ పార్టీలోనే ఎవరికి తెలియకుండా డ్రగ్స్ కన్జ్యూమ్ చేశాడా అనేది పోలీసుల విచారణలో బయటపడాల్సి ఉంది. మరోవైపు అతడికి డ్రగ్స్ ఎవరు ఇచ్చారు అనే దానిపైనా పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..