AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సౌకర్యం.. కీలక అప్డేట్ ఇదే..

హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ ఫేజ్-2 విస్తరణకు మార్గం సుగమైంది. త్వరలో రెండో దశ ఎంఎంటీఎస్ విస్తరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. త్వరలోనే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను విస్తరించే పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సౌకర్యం.. కీలక అప్డేట్ ఇదే..
Yadadri Mmts
Venkatrao Lella
|

Updated on: Feb 04, 2026 | 11:13 AM

Share

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామిని రోజూ వేలాదిమంది దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారికి దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. ప్రస్తుతం యాదాద్రికి నేరుగా రైలు సౌకర్యం అందుబాటులో లేదు. కేవలం బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. త్వరలో ఎంఎంటీఎస్ సౌకర్యం యాదాద్రికి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఎంఎంటీఎస్ సేవలు ఉండగా.. నగరం చుట్టుపక్కల ఉన్న శివారు ప్రాంతాలకు కూడా ఈ సేవలను విస్తరించేందుకు ఎంఎంటీఎస్ ఫేజ్-2 చేపడుతున్నారు. ఈ రెండో దశలో భాగంగా హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభం కానున్నాయి.

యాదాద్రికి ఎంఎంటీఎస్ రైళ్లు

యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సేవలను విస్తరించేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తవ్వగా.. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి యాదాద్రి సమీపంలోని రాయగిరి రైల్వే స్టేషన్ వరకు ఎంఎంటీఎస్ రైళ్ల కోసం ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయనున్నారు. రైల్ వికాస్ నిగమ్ లిమిడెట్ ఈ పనులు చేపట్టేందుకు టెండర్లు దక్కించుకుంది. మూడేళ్లల్లో ఈ ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు. దాదాపు 33 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మాణానికి రూ.430 కోట్లు ఖర్చు చేయనున్నారు. సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి, ఘట్కేసర్ మీదుగా నిర్మించనున్న ఈ ట్రాక్‌కు రాయగిరి రైల్వే స్టేషన్‌ వద్ద కలుపుతారు. దీంతో భక్తులు రాయగిరి నుంచి రోడ్డు మార్గంలో సులువుగా 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రి దేవాలయానికి చేరుకోవచ్చు.

పూర్తైన భూసేకరణ ప్రక్రియ

యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ విస్తరించేందుకు ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. 2015 నుంచి ఈ మార్గంలో ఎంఎంటీఎస్ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలనే ప్రతిపాదన ఉంది. అప్పట్లో అధికారులు సర్వే కూడా చేపట్టారు. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ ఈ ప్రక్రియ పట్టాలెక్కింది. దాదాపు 9 ఏళ్ల పాటు పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్ పనులపై ఇప్పుడు మళ్లీ ముందడుగు పడింది. రైల్వేశాఖ స్వయంగా ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు ప్రకటించింది. దీంతో త్వరలోనే పనులను ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించారు. ఈ ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి వస్తే నగరంలోని ఎక్కడినుంచైనా ఎంఎంటీఎస్ ద్వారా యాదాద్రికి సులువుగా చేరుకోవచ్చు. ఇప్పటివరకు యాదాద్రికి రైలు సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో భక్తులు బస్సుల ద్వారానే వెళ్తున్నారు. ఇప్పుడు రైలు సౌకర్యం కూడా అందుబాటులోకి రానుంది.