తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతోన్న నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. క్రమంగా పొలిటికల్ హీట్ పెరుగుతోంది. రాజకీయ పార్టీలు ఎన్నికల యుద్ధానికి తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. నేడోరేపే అధినేత కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారని వార్తలు వస్తున్నాయి. సుమారు 112 సీట్లలో ఎలాంటి మార్పులు లేకుండానే ఎన్నికలు వెళ్లేందుకు గులాబీ బాస్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే అటు బీజేపీ కూడా ఎన్నికల రణరంగంలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ పార్టీ సభ్యుడు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈటల వ్యాఖ్యలను సమర్థించారు. త్వరలోనే 22 మంది నేతు బీజేపీలో చేరనున్నారని తేల్చి చెప్పారు. ఈ విషయమై టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన రఘునందన్.. ‘గతంలో ముందే నేతల పేర్లు బయటపడటంతో ఒత్తిడి తెచ్చి బయపెట్టి బీజేపీలోకి రాకుండా చేశారు. ఆపరేషన్ ఆకర్ష్ లో మా వ్యూహాలు మాకున్నాయి. త్వరలోనే బీజేపీ సత్తా ఏంటో చూస్తారు’ అని చెప్పుకొచ్చారు.
ఇక నిర్మల్ మాస్టర్ ప్లాన్‌పై కూడా రఘునందన్ స్పందించారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేసేంత వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రానున్న ఎన్నికల్లో డబ్బులు పంపిణి చేసేందుకే జీవో 220 దొంగ చాటుగా తీసుకొచ్చారన్నా ఆరోపించిన ఆయన.. ఆరు నెలల క్రితం రైతులు ఆందోళన చేస్తే వెనక్కి తగ్గినట్టుగా నమ్మించి రాత్రికి రాత్రి జీవోల ను తీసుకొచ్చారన్నారు. సొంత భూములకు రేట్లు పెంచుకునేందుకు చెరువులో కలెక్టరేట్ కట్టించిన ఘనుడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అని దుయ్యబట్టారు.
నిర్మల్ లో గొలుసు కట్టు చెరువుల భూకబ్జాలకు పాల్పడిన చరిత్ర ఇంద్రకరణ్ ది అంటూ విమర్శించారు. ఇక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సచ్చిలూడే అయితే సిట్టింగ్ జడ్జితో తాను కబ్జాలు చేయలేదని నిరూపించుకోవాలని రఘునందన్ సవాల్ విసిరారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేసి జీవో 220 వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలను ఉదృతం చేస్తామని తేల్చి చెప్పారు. మరి రఘునందన్ చేసిన వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..