రాష్ట్రంలోని ధరణి పై విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా మార్చుకునేందుకు ధరణిని తీసుకొచ్చారా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకొని..మంత్రులు ఫామ్ హౌస్ లు కట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా చండూరులోని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి 80 ఎకరాల భూమి కొనుగోలు చేసి..దాదాపు 165 ఎకరాల్లో ప్రహారీ గోడ కట్టారని మండిపడ్డారు. ఏకంగా కృష్ణానదిని ఆక్రమించుకుని ఫామ్ హౌస్ గోడ కట్టినట్లు ఆరోపించారు.
అయితే ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణలపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. రాజకీయ దురుద్దేశంతోనే రఘునందన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన స్వగ్రామం పాన్‌గడ్ లో ఉన్న భూములు 2014, 2018 ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నవేనని తెలిపారు. ఎస్టీల పేరిట భూములు కొని మార్చుకున్నామన్న మాటలు అవాస్తవమేనని కొట్టిపారేశారు. చట్టం ప్రకారం కొనుగోలు చేసిన దానికన్న ఒక గుంట ఎక్కువగా ఉన్నా ఆ భూములు తన పిల్లలు వదిలేస్తారని.. తాను కూడా రాజీనామ చేస్తానని తెలిపారు. తమ తప్పు లేకుంటే అసత్య ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే రఘునందన్ రాజీనామ చేయాలని సవాలు విసిరారు. తహశీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనకు ఈ భూములకు ముడిపెట్టడం నీచపు ఆరోపణలని అన్నారు. నిజాలు తెలుసుకోకుండా మాట్లాడిన రఘునందన్ రావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..