Telangana MLC Election 2021: ఎమ్మెల్సీ ఎన్నికల గడువు దగ్గరపడుతుండటంతో టీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను కాసేపట్లో టీఆర్‌ఎస్ అధిష్టానం ప్రకటించనుంది. ఆరుగురు ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌కే దక్కనున్నాయి. దీంతో ఆరుగురు అభ్యర్థులు ఎవరు? ఎవరెవరికి పదవులు దక్కనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఇవాళ మంచిరోజు కావడంతో ఏక్షణమైనా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్సీ రేసులో వరంగల్ జిల్లా నుంచి మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పార్టీ జనరల్ సెక్రటరీ తక్కెళ్లపల్లి రవీందరావుల పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. మరోవైపు నల్గొండ జిల్లా నుంచి మాజీ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి లేదా కోటిరెడ్డిలల్లో ఒకరికి చాన్స్ దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గుత్తా సుఖేందర్‌రెడ్డిని గవర్నర్ కోటాలో మండలికి పంపితే.. పెండింగ్‌లో కౌషిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాకు మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటు ఉమ్మడి కరీంనగర్ నుంచి ఇటీవల టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ తెలంగాణ అధ్యక్షులు ఎల్.రమణ పేరు కూడా విన్పిస్తోంది. పద్మశాలీ కోటా ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎవరూ లేరు. దీంతో ఈయన పేరు కచ్చితంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
ఇక, ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ పేరు కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రగతి భవన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఒకరిద్దరు కొత్తవారికి కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే అధికారికి ఎమ్మెల్సీగా పంపే అవకాశం ఉందని ప్రచారం. మంగళవారం నామినేషన్‌లకు చివరి రోజు కావడంతో ఇవాళ ఏక్షణమైనా అభ్యర్థులను ప్రకటించే అకాశం ఉంది.
Read Also… పెనుగొండ మున్సిపాలిటీలో స్వల్ప ఉద్రిక్తత.. గోరంట్ల మాధవ్ – పార్థసారథి పరస్పరం తిట్ల దండకం