Telangana: కూలీలతో కలిసి ట్రాక్టర్‌తో పొలం దున్ని నాటు వేసిన ఎమ్మెల్యే.. ఆశ్చర్యపోయిన రైతులు!

ఆ గ్రామంలో రైతులు పొలం దగ్గర నాటు వేస్తూ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో అక్కడికి కొన్ని కార్లు వచ్చాయి. అందులోంచి దిగి వచ్చిన వ్యక్తి పొలంలోకి వచ్చి రైతులతో కలిసి నాటు వేస్తూ వాళ్లలో ఉత్సాహాన్ని నింపారు. ఇంతకూ అక్కడికి వచ్చిన వ్యక్తి ఎవరరో కాదు స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య. ఎమ్మెల్యే వచ్చి తమతో పాటు పనులు చేయడంతో రైతులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

Telangana: కూలీలతో కలిసి ట్రాక్టర్‌తో పొలం దున్ని నాటు వేసిన ఎమ్మెల్యే.. ఆశ్చర్యపోయిన రైతులు!

Edited By:

Updated on: Aug 02, 2025 | 12:56 PM

నిత్యం ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉండే ప్రజా ప్రతినిధులు అప్పుడప్పుడూ పంట పొలాల్లో కనిపించి ప్రజలను ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా ఇలానే సడెన్‌గా పంట పొలాల్లొకి వచ్చి రైతులతో కలిసి ట్రాక్టర్‌తో పొలం దున్ని నాటు వేసి, తర్వాత అక్కడే భోజనం చేసి వారిని ఆశ్చర్యపరిచారు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటించారు. పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

అనంతరం ఎమ్మెల్యే స్వయంగా గ్రామంలో పర్యటించి రైతులు, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగానే పొలంలో పనిచేస్తున్న కూలీల వద్దకు వెళ్లారు. పొలంలోకి దిగి ట్రాక్టర్‌తో పొలాన్ని సాగు చేసి కూలీలతో కలిసి సరదాగా నాటు వేసారు. అంతే కాకుండా పొలం వద్దనే కూలీలతో కూర్చుని భోజనం చేశారు. ఈ క్రమంలో వారితో కాసేపు సరదాగా ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయో లేదా అని తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. తాను మీ రైతు బిడ్డనే అని.. తమది కూడా వ్యవసాయ కుటుంబమేనని తెలిపారు. వ్యవసాయం అంటే తనకు ఎంతో మక్కువ అంటూ వారితో చెప్పుకొచ్చారు. పొలంలో రైతులను చూస్తే ఆనందం ఆపుకోలేక పని చేయాలని అనిపించి కాసేపు వాళ్లతో పనిలో నిమగ్నమయ్యానని ఆయన అన్నారు. ఎమ్మెల్యే తనతో పాటు పొలంలో పనిచేయడంతో, తమతో కూర్చొని భోజనం చేయడంతో స్థానిక రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.