అంగన్వాడి వస్తువుల నాణ్యతపై మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి.. కాంట్రాక్టర్లకు హెచ్చరిక..

| Edited By: Srikar T

Aug 16, 2024 | 10:14 PM

అంగన్వాడి కేంద్రాలకు నాణ్యత లేని వస్తువులు సరఫరా చేస్తే కాంట్రాక్టులను రద్దు చేస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క హెచ్చరించారు. అంగన్వాడి కేంద్రాలకు నాణ్యమైన గుడ్లు, వస్తువులు సరఫరా చేయండి.. లేకపోతే తప్పుకొండి అని హెచ్చరించారు.

అంగన్వాడి వస్తువుల నాణ్యతపై మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి.. కాంట్రాక్టర్లకు హెచ్చరిక..
Minister Seetakka
Follow us on

అంగన్వాడి కేంద్రాలకు నాణ్యత లేని వస్తువులు సరఫరా చేస్తే కాంట్రాక్టులను రద్దు చేస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క హెచ్చరించారు. అంగన్వాడి కేంద్రాలకు నాణ్యమైన గుడ్లు, వస్తువులు సరఫరా చేయండి.. లేకపోతే తప్పుకొండి అని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించని పక్షంలో తామే తప్పిస్తామని సీతక్క ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడి కేంద్రాలకు సరఫరా అవుతున్న ఆహార పదార్థాలు, కోడి గుడ్లు నాణ్యత పెంపు కోసం సప్లై కాంట్రాక్టర్లతో మంత్రి సీతక్క, శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ కాంతి వెస్లీ శుక్రవారం సచివాలయంలో రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడి కేంద్రాలకు పేద పిల్లలు వస్తారని వారికి పోషకాహారం అందించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. అందుకే అంగన్వాడి కేంద్రాలకు నాణ్యమైన వస్తువులు సరఫరా చేయాలని చెప్పారు. నాణ్యమైన గుడ్లు సరఫరా చేయటం లేదని వార్తలు రావడంపై సప్లయర్ల నుంచి వివరణ కోరారు. అంగన్వాడి సెంటర్ల నుంచి వచ్చే విమర్శలు భరించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. అందుకే సప్లయర్లంతా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ గుడ్లు ఆహార వస్తువులను సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నాణ్యమైన వస్తువులు సరఫరా చేయకపోతే కాంట్రాక్టును రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు.

బీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న సప్లయర్లే ఇప్పటికీ కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారనీ, తాము సప్లయర్లను మార్చలేదనీ, అందుకే సప్లయర్లు మరింత శ్రద్ధతో మంచి గుడ్లను సరఫరా చేయాలనీ సూచించారు. అయితే ఏ ఒక్క అంగన్వాడీ కేంద్రంలో కోడిగుడ్ల విషయంలో సమస్యలు ఉత్పన్నం కావట్లేదని, కేవలం టేక్ హోమ్ రేషన్‎లో భాగంగా ఇంటికి తీసుకు వెళుతున్న గుడ్లవల్లనే సమస్యలు తలెత్తుతున్నాయని సప్లయర్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గుడ్లను ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత సకాలంలో వాడకుండా చాలా రోజుల తర్వాత వినియోగించడం వల్ల గుడ్లు మురిగిపోతున్నాయని సప్లయర్లు తెలిపారు.

ఈ సమస్య ఉత్పన్నం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని, సప్లయర్లను మంత్రి ఆదేశించారు. సకాలంలో గుడ్లను వినియోగించుకునే విధంగా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. గాలి వెలుతురు సోకేలా అంగన్వాడి సెంటర్లలో గుడ్లను స్టాక్ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.టేక్ హోమ్ రేషన్ కారణంగా ఎదురవుతున్న సమస్యలను అధిగమించేలా ఆ పథకంలో సంస్కరణలు తీసుకురావాలని మంత్రి చెప్పారు. అంగన్వాడీ టీచర్లు సిబ్బంది మరింత క్రియాశీలకంగా పనిచేయాలని, నాణ్యత లేని వస్తువులను రిజెక్ట్ చేయాలనీ, లేకపోతే చర్యలు ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరించారు.

అయితే పెరిగిన రేట్లకు అనుగుణంగా కోడిగుడ్ల రేట్లను పెంచాలని, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్నట్లుగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అంగన్వాడీ సప్లయర్లకు త్వరగా బిల్లు చెల్లించాలని సప్లయర్లు కోరారు. ధరలు పెంచేందుకు మంత్రి సీతక్క ససేమిరా అన్నారు. ఒప్పంద పత్రాల్లో కుదుర్చుకున్న నిబంధనలను కాదని ధరలు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో అంగన్వాడీల బిల్లుల చెల్లింపు కోసం గ్రీన్ ఛానల్ ఉండేదని.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధానాన్ని రద్దు చేశారని తెలిపారు. గత పది ఏళ్లలో పూర్తిగా ఈ వ్యవస్థ గాడి తప్పిందన్నారు. గాడి తప్పిన వ్యవస్థను సరైన మార్గంలో నడిపించి అంగన్వాడి కేంద్రాల్లో మెరుగైన సేవలు అందిస్తామని మంత్రి సీతక్క తేల్చి చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..