Telangana Government: తెలంగాణలో మరో కొత్త కార్యక్రమం.. వారందరికీ ప్రభుత్వం నుంచి సాయం.. లబ్దిదారుల ఎంపిక షురూ
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో అత్యంత పేదలను గుర్తించే కార్యక్రమానికి నడుం బిగించింది. ఈ మేరకు ఇంటింటి సర్వే చేపట్టాలని ఆధికారులను ఆదేశించింది. వీరిని గుర్తించి తర్వాత అన్ని విధాలుగా సహాయం అందించనున్నారు. ఈ మేరకు..

సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదల సంక్షేమం కోసం అనే పథకాలను అమలు చేస్తోన్న రేవంత్ సర్కార్.. మరికొన్ని స్కీమ్స్‌ను లాంచ్ చేసేందుకు సిద్దవుతోంది. బీపీఎల్ కుటుంబాల్లోని పేదలకు ఆపపన్నహస్తం అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో పేదల కోసం తెలంగాణ సర్కార్ మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అత్యంత పేదలను గుర్తించే కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. అత్యంత పేదరికంతో ఉన్నవారిని గుర్తించి వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం తరపున సహాయం అందిస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అత్యంత పేదలు గుర్తింపు
తాజాగా సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో దివ్య దేవరాజన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అత్యంత పేదలను గుర్తించాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపట్టాలని సూచించారు. ఈ సర్వే ఆధారంగా పేదలను గుర్తించనున్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ సర్వే చేపట్టాలని సీతక్క ఆదేశాలు జారీ చేశారు. విడతల వారీగా ఈ సర్వే జగనుండగా.. తొలుత బాగా వెనుకబడిన గ్రామాల్లో చేపట్టనున్నారు. పేదలను గుర్తించిన తర్వాత విడతల వారీగా వారికి సాయం అందించనున్నారు. విద్య, ఉపాధి, ఆరోగ్యం, స్కిల్ డెవలప్‌మెంట్, హెల్త్ వంటి వాటిల్లో వీరికి సహాయం అందిస్తారు. ఇందుకు లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని సీతక్క సూచించారు.
పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక
గ్రామస్తులందరినీ ఒకేచోట చేర్చి లబ్దిదారులను ఎంపిక చేస్తారు. కుటుంబ జీవనం, ఆదాయం, నివాస, ఉపాధి అవకాశాలను పరిగణలోకి తీసుకుని లబ్దిదారులను ఎంపిక చేయాలని సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. పేదలను సంపన్నులుగా తీర్చిదిద్దటమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ కార్యదర్శి శృతి ఓజా, మహిళా శిశు, సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ పాల్గొన్నారు.
